భాగ్యశ్రీ..అలనాటి యువతరానికి కలల రాకుమారి. ‘మైనే ప్యార్ కియా’ చిత్రంతో నాటి కుర్రకారు ఆరాధ్య నాయికగా భాసిల్లింది. తెలుగులో ‘రాణా’ ‘ఓంకారం’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భాగ్యశ్రీ తెలుగు తెరపై పునరాగమనం చేసింది. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రంలో ఆయనకు తల్లిగా నటించిందామె. ఈ చిత్రం ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ గురువారం పాత్రికేయులతో ముచ్చటించింది.
చాలా విరామం తర్వాత తెలుగు సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. సెట్స్‌లోకి అడుగుపెట్టగానే దర్శకుడు రాధాకృష్ణ ‘మేమంతా మీ అభిమానులం. మీరు ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాం’ అంటూ సహృదయంతో స్వాగతం పలికారు. ప్రభాస్ అందరికి డార్లింగ్లాంటివాడు. ఈ సినిమాతో నా డార్లింగ్ అయ్యాడు (నవ్వుతూ). ఈ సినిమా కోసం వేసిన సెట్స్ అత్యద్భుతంగా అనిపించాయి. నా సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సెట్స్ చూశా. కానీ వీటిలో భారీతనంతో పాటు ఏదో తెలియని ఆకర్షణ కనిపించింది. ఓ కొత్త ప్రపంచాన్ని దర్శించాననే అనుభూతి కలిగింది.
ఈ సినిమాలో నేను నృత్యకారిణి అయిన యంగ్మదర్ పాత్రలో కనిపిస్తా. ఆమె జీవితంలో స్ఫూర్తిగా తీసుకునే విషయాలు చాలా ఉంటాయి. సినిమాకు ముందు నృత్యంలో నాకు ఎటువంటి ప్రవేశం లేదు. చాలా తక్కువ సమయంలోనే భరతనాట్యం నేర్చుకున్నా. జార్జియాలో డ్యాన్స్ సీన్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు తీవ్రమైన చలి ఉండేది. అతిశీతల వాతావరణంలో నృత్యం చేయడం కష్టంగా అనిపించింది.
ఈ సినిమా లంచ్బ్రేక్స్ను మా టీమ్ అంతా ఎంజాయ్ చేశాం. ప్రభాస్ ఇంటిదగ్గరి నుంచి ప్రతి రోజు షడ్రసోపేతమైన విందుభోజనం వచ్చేది. లంచ్ అనగానే అందరిలో ఉత్సాహం కలిగేది. చక్కటి రుచికరమైన ఇంటిభోజనాన్ని మా కోసం సమకూర్చిన ప్రభాస్‌కు కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రభాస్ చాలా సౌమ్యుడు. సహనటీనటుల్ని ఎంతగానో గౌరవిస్తాడు. ‘బాహుబలి’ సినిమాతో గొప్ప కీర్తిప్రతిష్టలు సంపాదించినా ఇసుమంత గర్వం కూడా కనిపించదు. కుటుంబ బంధాలకు అతను చాలా ప్రాముఖ్యతనిస్తాడు.
ఇన్నేళ్లుగా కెరీర్లో కొనసాగుతున్నా..ఇప్పటికీ అదే అందంతో కనిపిస్తున్నారని చాలా మంది అడుగుతుంటారు. నేను ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటా. రెగ్యులర్ వర్కవుట్స్‌తో పాటు నీళ్లు బాగా తాగుతాను. ఎలాంటి టెన్షన్స్ లేకుండా కంటినిండా నిద్రపోతాను. అన్నింటికంటే ముఖ్యంగా మితాహారమే నా ఆరోగ్యరహస్యంగా భావిస్తా.
నా దృష్టిలో తల్లి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నేడు ఎన్నో రంగాల్లో మాతృమూర్తులు సత్తా చాటుతున్నారు. కుటుంబ బాధ్యతల్ని నెరవేరుస్తూనే అద్భుత ప్రతిభాసంపత్తులతో రాణిస్తున్నారు. అందుకే నేను తల్లి పాత్రల్ని బాగా ఇష్టపడతాను. భవిష్యత్తులో విభిన్న పాత్రల్ని పోషించాలనుంది.