RTC | హనుమకొండ చౌరస్తా: వరంగల్ రీజియన్ ఆర్టీసీ (RTC)లో ఏడాది నుంచి 90 మంది కండక్టర్లు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. యాజమాన్యం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే విధుల నుంచి తొలగించింది. దీంతో వారు శనివారం హనుమకొండలోని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సంవత్సరం నుంచి తమతో విధులు చేయించుకుని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీకి సంబంధించిన పలు కీలక సమయాల్లో మేడారం మహాజాతరను విజయవంతం చేయడంలో తమ పాత్ర ఎంతో ఉందని అన్నారు. అలా తమ సేవలను వినియోగించుకున్న తర్వాత అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించడంతో తమ కుటుంబాలు ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఏర్పడిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, తమ కుటుంబాలను రోడ్డున పడకుండా ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆర్టీసీ సంస్థకు చెందిన కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీ (Outsourcing Agency)లు తమను తీసుకుని ఇప్పుడు తొలగించడం అన్యాయమని, డబ్బులు ఇచ్చినవారిని తొలగించలేదని వాపోయారు. గత ఆర్ఎం-ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు కుమ్మక్కయ్యారని, డిసెంబర్ వరకు అగ్రిమెంట్ ఉన్నా కూడా చెప్పకుండా అకారణంగా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సంస్థకు చెందిన అక్షయ ఎంట్రప్రైజెస్, ఏషియన్ మ్యాన్‌పవర్ అండ్ ప్లేస్మెట్స్సర్వీస్, హనుమాన్ మ్యాన్‌పవర్ సర్వీస్, ఓంసాయి సెక్యూరిటీ ఫోర్స్, శ్రీనివాస గ్రూప్స్ ఎస్వీ, శ్రీఆంజనేయ మ్యాన్‌పవర్ ఏజెన్సీ, పరమేశ్వర ఎంట్రప్రైజెస్, విజ్ఞాన్ మ్యాన్‌పవర్, ఎస్ఆర్కేటీ ఏజెన్సీలు కొంతమంది వద్ద డబ్బులు తీసుకుని ఇప్పుడు తొలగించాలరని, ఇందులో ముఖ్యంగా చంద్రశేఖర్ ఏజెన్సీ ఎక్కువ మందిని తీసుకున్నట్లు వారు ఆరోపించారు. డబ్బులు తీసుకుని నియమించిన ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల యజమానులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ విషయమై ఆర్ఎం (RM) భవానీప్రసాద్‌ను వివరణ కోరగా ‘ఎవరైతే కాంట్రాక్ట్ పూర్తయిందో వారిని తొలిగించామని, వారిని తీసుకున్న ఏజెన్సీలను అడగాలని సమాధానం’ ఇచ్చారు.