ముందస్తు హెచ్చరిక లేని తుఫానులా తమిళ అగ్ర నటుడు ధనుష్- ఐశ్వర్య దంపతుల విడాకుల ప్రకటన దక్షిణాదితో పాటు యావత్ భారతీయ చిత్రసీమలో దుమారాన్ని రేపింది. అర్ధరాత్రి చేసిన ఒకే ఒక ట్వీట్‌తో ఐశ్వర్యతో తన వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు ధనుష్. ఐశ్వర్య కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అదే విషయాన్ని వెల్లడించింది. ఇటీవలకాలంలో సినీరంగంలో విడాకుల వ్యవహారాలు మామూలైపోయినప్పటికి సూపర్‌స్టార్ రజనీకాంత్ కుటుంబానికి సంబంధించిన వ్యవహరం కాబట్టి ఈ డైవోర్స్ ఇష్యూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇద్దరి మధ్య ఏం జరిగింది?
ధనుష్ విడాకుల ప్రకటన చేసినప్పటి నుంచి ఈ జంట మధ్య ఏం జరిగింది? ఏ పరిస్థితులు వారిని అంతటి కఠినమైన నిర్ణయం వైపు నడిపించాయి? అనే ప్రశ్నలు సోషల్‌మీడియాలో హోరెత్తుతున్నాయి. ఎప్పుడో పద్దెనిమిదేళ్ల క్రితం జరిగిన వివాహం, ఎలాంటి అరమరికలులేని అన్యోన్య దాంపత్యం, తమ అనుబంధానికి ప్రతిరూపంగా ఇద్దరు మగపిల్లలు, ఇద్దరిదీ ఘనమైన కుటుంబ నేపథ్యం..ఏ వైభోగానికి లోటులేని జీవితం…ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నప్పటికీ ధనుష్-ఐశ్వర్య విడాకులు ఎందుకు తీసుకున్నారన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. గత ఏడాది అక్టోబర్‌లో రజనీకాంత్ దాదాసాహెబ్ఫాల్కే అవార్డు స్వీకరించారు. అదే వేదిక నుంచి ధనుష్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సమయంలో ట్విట్టర్లో మహానందాన్ని వ్యక్తం చేసింది ఐశ్వర్య. తండ్రి, భర్త ఇద్దరూ సాధించిన విజయాల్ని చూసి గర్వపడుతున్నట్లు పేర్కొంది. మూడునెలల వ్యవధిలోనే వారి మధ్య విభేదాలకు దారితీసిన అంశాలేమిటన్నది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. నిప్పులేనిదే పొగరాదన్నట్లు వీరి తెగతెంపుల వెనక బలమైన ఇగో కారణాలు ఉన్నాయన్నది ఓ వాదన. కెరీర్‌పరంగా ధనుష్ దూసుకుపోతున్న తీరు..దక్షిణాది నుంచి జాతీయస్థాయి నటుడిగా ఎదిగిన వైనం కూడా దంపతుల మధ్య ఇగో సమస్యలకు కారణమయ్యాయని అంటున్నారు. తొలినాళ్లలో సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడిగా ఇండస్ట్రీలో గుర్తింపుతో పాటు సినీ అవకాశాల్ని సంపాదించుకున్నారు ధనుష్. అయితే ఆయన కుటుంబ వారసత్వం తక్కువేమీ కాదు. తమిళ దర్శకనిర్మాత కస్తూరి రాజా చిన్న కుమారుడు ధనుష్. ఆయన అన్నయ్య సెల్వరాఘవన్ అగ్ర దర్శకుడు. పెళ్లికి ముందే రెండు సినిమాల్లో హీరోగా నటించారు ధనుష్. తనదీ ఘనమైన కుటుంబ నేపథ్యమే అయినప్పటికీ ధనుష్ మామ చాటు అల్లుడిగానే కెరీర్ తొలినాళ్లలో కొనసాగారు. బాలీవుడ్ చిత్రం ‘రాన్‌జనా’తో ధనుష్ పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోయింది. మరోవైపు మాతృభాష తమిళంలో ప్రయోగాత్మక చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సృష్టించుకున్నారాయన. గత దశాబ్దంలో తనదైన సొంత ప్రతిభతో కీర్తిప్రతిష్టల్ని ఇనుమడింపజేసుకున్నారు. రజనీకాంత్ అల్లుడనే ఛట్రం నుంచి బయటపడి పాన్ఇండియా నటుడిగా ఛరిష్మాను పెంచుకున్నారు ధనుష్. కెరీర్‌పరంగా సాధించిన అద్భుత పురోగతి కూడా ఆయన వ్యక్తిత్వంలో మార్పును తీసుకొచ్చిందని..ఈ కారణంగానే భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలొచ్చాయని సమాచారం. కొందరు కథానాయికలతో ధనుష్‌కు ఉన్న సాన్నిహిత్యం కూడా విడాకులకు కారణమై ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
దక్షిణాదిలో పెరుగుతున్న విడాకుల ట్రెండ్
ఒకప్పుడు విడాకులకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా బాలీవుడ్లోనే వినిపించేవి. హృతిక్‌రోషన్, అర్భాజ్‌ఖాన్, ఫరాన్అక్తర్, అర్జున్‌రాంపాల్ వంటి తారలు విడాకులతో వార్తల్లో నిలిచారు. దక్షిణాదిలో ఈ డైవోర్స్ వ్యవహారాలు ఎప్పుడో కానీ వినిపించేవి కాదు.. గత ఏడాది నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. నాలుగేళ్ల బంధానికి వీడ్కోలు పలుకుతూ చైతూ-సమంత తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేసింది. అదే తరహాలో ధనుష్-ఐశ్వర్య విడాకుల వ్యవహారం దక్షిణాదిన కలకలం సృష్టిస్తున్నది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఉత్సుకత వల్ల తారల విడాకుల వ్యవహారాలు సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఇదిలావుండగా మహాభారతంలో కృష్ణుడి పాత్ర ద్వారా తిరుగులేని పేరు సంపాదించుకున్న నితీష్భరద్వాజ్ కూడా భార్య స్మితతో విడాకులు తీసుకున్నారు. పన్నెండేళ్ల వైవాహిక బంధానికి బాధాతప్త హృదయంతో వీడ్కోలు పలుకుతున్నానని ఆయన ట్విట్టర్లో చెప్పారు.