జురిచ్, ఫిబ్రవరి 18 : ప్రపంచంలో ఆరోగ్య సంక్షోభానికి ప్రధానంగా కారణమవుతున్న మధుమేహ చికిత్సకు స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు కొత్త విధానాన్ని రూపొందించారు. మధుమేహ బాధితుల్లో బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించగలిగే లక్షిత సెల్ థెరపీని వీరు అభివృద్ధి చేశారు. జురిచ్‌లోని ఈటీహెచ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ కొత్త విధానానికి సంబంధించిన వివరాలు ‘నేచర్ బయోమెడికల్ ఇంజినీరింగ్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా మానవ శరీరానికి బ్లడ్ షుగర్‌ను క్రమబద్ధీకరించే సామర్థ్యం ఉంటుంది. భోజనం చేసిన తర్వాత పెరిగే చెక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించేందుకు పాంక్రియాటిక్ కణాలు శరీరానికి ఒక సిగ్నల్‌గా ఉపయోగపడతాయి. మధుమేహం ఉన్న వారిలో ఈ వ్యవస్థ విఫలమవుతుంది. సెల్ థెరపీల ద్వారా ఈ వ్యవస్థను పునరుద్ధరించి, సహజసిద్ధంగా బ్లడ్ షుగర్‌ను క్రమబద్ధీకరించేలా చేయొచ్చని పరిశోధకులు చెప్తున్నారు.
ఇందుకోసం మానవ కణాలను సేకరించి, జన్యుపరమైన మార్పులు చేసి మళ్లీ మధుమేహ బాధితుల చర్మం కిందకు పంపిస్తారు. కణాలను నియంత్రించడానికి ఒక స్విచ్ లాంటి ఏర్పాటు కావాలి. ఇందుకోసం ఛాతినొప్పిని తగ్గించే నైట్రోగ్లిజరిన్ను ఉపయోగించి సరికొత్త ఆవిష్కరణ చేశారు. చర్మంపై ఒక బ్యాండేజ్ లాంటి ప్యాచ్ వేసి, దాని ద్వారా చర్మంలోకి నైట్రోగ్లిజరిన్ను పంపిస్తారు. అప్పటికే చర్మం కిందకు పంపించిన జన్యు మార్పులు చేసిన కణాలతో ఇది కలుస్తుంది. ఈ కణాలు నైట్రోగ్లిజరిన్ను నైట్రిక్ ఆక్సైడ్(ఎన్ఓ)గా మారుస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ జీఎల్పీ-1 అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను క్రమబద్ధీకరించేందుకు ఇన్సులిన్‌ను విడుదల చేసేలా క్లోమాన్ని(పాంక్రియాస్) ప్రేరేపిస్తుంది. తద్వారా మధుమేహుల్లో సహజసిద్ధంగా ఇన్సులిన్ ఉత్పత్తి వ్యవస్థను పునరుద్ధరించవచ్చని పరిశోధకులు తెలిపారు.