
కందుకూరు, నవంబర్ 23 : నాడు చనిపోతే దహన సంస్కారాలకు ఆరడుగుల స్థలం దొరకకా అవస్థలు పడిన దుస్థితి. కానీ స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ సమస్య తీరింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఆఖరి మజిలీకి అవస్థలు పడకుండా సకల వసతులతో కూడిన ఊరూరా వైకుంఠ ధామాలను ఏర్పాటు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా కందుకూరు మండలంలోని 35 గ్రామ పంచాయతీల్లో దాదాపు రూ.4కోట్ల వ్యయంతో వైకుంఠ ధామాలను నిర్మించారు. దీంతో దహన సంస్కారాల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలిగాయి. అదే విధంగా పారిశుధ్య సమస్యను పరిష్కరించేందుకు డంపింగ్ యార్డులను సైతం ఏర్పాటు చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సమస్య తీరింది
రాష్ట్ర ఏర్పాటుకు ముందు దహన సంస్కారాల కోసం నిరుపేదలు ఇబ్బందులకు గురయ్యేది. వైకుంఠ ధామాల ఏర్పాటు తర్వాత ఆ సమస్య తీరింది. గ్రామాల ప్రజల ఇబ్బందులను గుర్తించి అన్ని వసతులతో కూడిన వైకుంఠ ధామాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
ఇబ్బందుల్లేవ్..
గ్రామంలో ఎవరైనా చనిపోతే ఎక్కడ దహన సంస్కారాలు చేయాలో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చేందేవారు. అలాంటి వారిని దృష్టిలో పెటుకొని సీఎం కేసీఆర్ వైకుంఠ ధామాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అన్ని కులాల వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే చోట దహన సంస్కరణలు చేసుకుంటున్నారు.
35 పంచాయతీల్లో పూర్తి ..
మండల పరిధిలోని 35 గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రతి పంచాయతీకి ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.11లక్షల 50వేలు మంజూరు చేసి స్నానపు గదులు, విశ్రాంతి గదులు, ముఖద్వారం వంటి నిర్మాణాలను పూర్తి చేశాం. వైకుంఠ ధామాల్లో సకల వసతులు కల్పించాం. ఇందులో సర్పంచ్ల ప్రమేయం ఎంతో ఉంది.