మహబూబ్‌నగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లోని హకీంపేటలో వెలుగులోకి వచ్చిన ‘మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్కు’ కుంభకోణానికి నోటిఫికేషన్ నుంచే బాటలు పడ్డాయి. సర్వే నంబర్ 252కు సంబంధించి అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్ ఈ స్కామ్‌కు తొలి అడుగుగా మారింది. రాష్ట్ర భూసేకరణ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో నోటిఫికేషన్‌ను సిద్ధం చేసి జారీ చేశారని ఆ శాఖ అధికారులే చెప్తున్నారు. ఎంతమంది రైతుల దగ్గరి నుంచి ఎంత భూమి సేకరిస్తున్నారనే కనీస విషయాలు కూడా అందులో లేవని పేర్కొన్నారు.
తద్వారా ఉన్నతాధికారులు అక్రమార్కులకు అండగా నిలిచారని ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్ 252లో ఉన్న ప్రభుత్వ భూమిలో తాతల కాలం నుంచి సాగు చేస్తున్న రైతులను నిలువునా ముంచి, అడ్డగోలుగా విస్తీర్ణాన్ని పెంచి, నోటిఫికేషన్లో ఏ రైతు ఎంత సాగు చేస్తున్నాడు? అనే వివరాలను దాచిపెట్టి వేసిన నోటిఫికేషన్ భూ సేకరణ చరిత్రలోనే ఓ మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. పదో తరగతి కూడా పాస్ కాని ఓ వంట మనిషి చెప్తే, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు జీ హుజూర్ అనడం విస్తుగొలుపుతున్నది.
హకీంపేట సమీపంలో ఏర్పాటు చేస్తున్న మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం 2024 డిసెంబర్ 1న, కొన్ని పత్రికల్లో భూసేకరణ నోటిఫికేషన్లు ప్రచురితమయ్యాయి. హకీంపేట గ్రామ శివారులోని సర్వే నంబర్ 252 ప్రభుత్వ భూమికి సంబంధించి మొత్తం 351.10 ఎకరాలు సేకరిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. సుమారు 218 మంది రైతులకు సంబంధించి లావుణి పట్టా ఉన్న మెట్ట భూములను సేకరిస్తున్నట్టు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, భూసేకరణ అధికారి, రెవెన్యూ డివిజన్ తాండూరు పేరుతో విడుదలైన నోటిఫికేషన్లోనే అసలు మర్మం దాగి ఉన్నది.
218 మంది రైతుల నుంచి భూమిని సేకరిస్తున్నామని చెప్పారే తప్ప, ఎంత భూమి సేకరిస్తున్నారు? వంటి వివరాలు మచ్చుకైనా కనిపించలేదని బాధితులు తెలిపారు. భూసేకరణ చరిత్రలోనే ఇలాంటి నోటిఫికేషన్ లేదన్నారు. సర్వే నంబర్ 252లో భూవిస్తీర్ణం 219 ఎకరాలు మాత్రమే ఉండగా, దానిని 360 ఎకరాలకు పెంచినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ రైతు నుంచి ఎంత సేకరిస్తున్నారనేది చెప్పకుండా పరిహారం ఎలా ఫిక్స్ చేశారు? ఎవరు ఫిక్స్ చేశారు? అనేది జిల్లా కలెక్టరే సమాధానం చెప్పాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
పారిశ్రామికవాడ భూ సేకరణ, పరిహారం పంపిణీలో ఆక్రమాలు బయటపడుతుండటంతో కొందరు సహించలేక, గ్రామంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో కొం దరు బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి, వారిపై దాడులకు పాల్పడేందుకు కూడా వెనుకాడవద్దని ఆదేశించినట్టు సమాచారం. ప్రస్తుతం హకీంపేట చుట్టుపక్కల రౌడీరాజ్యం నడుస్తున్నదని బాధిత రైతులు చెప్తున్నారు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని కేసులు పెడుతామని, జైళ్లకు పంపిస్తామని హెచ్చరిస్తున్నట్టు తెలిపారు. దీంతో చాలామంది రైతులు భయాందోళన చెందుతున్నారు.
సర్వేనంబర్ 252లో ఉన్న 218 మంది వాస్తవ రైతులకు ఎంత పరిహారం ఇవ్వాలో షాడో తన ఇంట్లోనే ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఆయన సోదరుడు భూముల వ్యవహారంలో ఆరితేరాడని, ఆయన ఇచ్చిన జాబితానే ఉన్నత అధికారులు ధ్రువీకరించారని, వారికి మాత్రమే పరిహారం అందజేశారని అంటున్నారు. దీంతో పరిహారం అందక చాలామంది రైతులు గగ్గోలు పెడుతున్నారు. అడిగితే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నట్టు చెప్తున్నారు. షాడో తన కుటుంబ సభ్యులకు సంబంధించిన 16 ఎకరాల భూములు పోయాయంటూ పరిహారం నొక్కేశారని ఆరోపిస్తున్నారు.