యువ కథానాయకుడు శ్రీవిష్ణుని కొత్తదనానికి చిరుమానాగా చెబుతుంటారు. ప్రతి సినిమాకు వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున ఫల్గుణ’. తేజ మార్ని దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి లిరికల్ పాట ‘గోదారివాళ్లే సందమామ..’ను శనివారం విడుదల చేశారు. గోదావరి జిల్లాలోని ప్రజల మనస్తత్వం, వాతావరణాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగుతుందని చిత్రబృందం తెలిపింది. చైతన్యప్రసాద్ రచించిన ఈ గీతాన్ని అమల చేబోలు, అరవింద్ ఆలపించారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యన్ స్వరాల్ని అందించారు. టీజర్‌కు మంచి స్పందన లభించిందని, త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. అమృతా అయ్యర్, నరేష్, శివాజీరాజా, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ మార్ని.