అజరామరమైన గీతాలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవలే స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా కోసం ఆయన చివరి పాట రాశారు. ఈ గీతాన్ని మంగళవారం విడుదల చేయబోతున్నారు. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. ఈ నెల 24న ప్రేక్షకులముందుకురానుంది. ‘సిరివెన్నెల’ పాటకు మిక్కీ జే మేయర్ స్వరాల్ని సమకూర్చారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఇప్పటికే విడుదల చేసిన పాట ప్రోమోకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని చిత్ర బృందం తెలిపింది. సోమవారం సినిమా తాలూకు కొత్త పోస్టర్ను విడుదల చేశారు. నాని, సాయిపల్లవి మధ్య ప్రణయ సన్నివేశాలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయని దర్శకుడు తెలిపారు. రాహుల్ రవీంద్రన్, మురళీశర్మ, అభినవ్ గోమటం, జిషుసేన్గుప్తా, లీలా సామన్స్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జే మేయర్, కథ: సత్యదేవ్ జంగా, నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్స్, దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్.