హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పరిధిలోని పరిశ్రమల భూములను అడ్డికి పావుశేరు బేరం పెట్టి, వందిమాగధులకు కట్టబెట్టి సొమ్ము చేసుకోవాలని భారీ భూదందాకు ప్రయత్నించిన ప్రభుత్వ పెద్దలు, బిగ్ బ్రదర్స్ అనుకున్నదొక్కటి, కానీ కథ అడ్డం తిరిగి అయ్యిందొక్కటి. గుట్టుగా సాగించాలనకున్న భూదందా వ్యవహారం బహిర్గతం కావడంతో ఇప్పుడు నాలుక కర్చుకుంటున్నారు. హైదరాబాద్‌లోని విలువైన పరిశ్రమల భూములే లక్ష్యంగా తెచ్చిన హిల్ట్(హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్)పాలసీ వెనుక పక్కా స్కెచ్ ఉన్నదని, కనీసం మంత్రులకు తెలియకుండా, క్యాబినెట్లో కూడా పెద్దగా చర్చ కూడా జరగొద్దనే ఉద్దేశంతో ఎజెండాలో చివరి అంశంగా చేర్చినట్టు తెలుస్తున్నది.
ఈ భూములను సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు, బిగ్ బ్రదర్స్, ఆరు నెలల క్రితమే తెరవెనుక మంత్రాగం నడిపారు.సీఎంవో ముఖ్య అధికారి కనుసన్నల్లో కేవలం రెండు నెలల్లోనే కథ ముగించేలా స్కెచ్వేశారు. పరిశ్రమల నుంచి భూములు లాక్కోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ దీనికి ముసుగు వేసేందుకే కాలుష్యకారక పరిశ్రమలను తరలిస్తున్నామనే ముద్రవేశారు. బిగ్‌బ్రదర్స్ సూచన మేరకు పారిశ్రామికవేత్తలతో సీఎంవోలోని ముఖ్యఅధికారి పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
ఇండస్ట్రియల్ ల్యాండ్స్‌ను ట్రాన్స్ఫర్మేషన్ చేస్తామని వీటిని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చని, పరిశ్రమలను ఔటర్ అవతలకు తరలించాలని సూచించారు. దీనికి బదులుగా అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించాలని పారిశ్రామికవేత్తలు కోరగా, సొంతంగా సెజ్‌లలో కొనుక్కోవాల్సిందేనని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనను పారిశ్రామికవేత్తలు తీవ్రంగా వ్యతిరేకించి సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయినట్టు తెలిసింది. దీంతో వెంటనే టీజీఐఐసీ ఆదేశాలు వెళ్లగా హిల్ట్ పాలసీని ఆగమేఘాల మీద రూపొందించారు. ఇంత పెద్ద నిర్ణయాన్ని మొక్కుబడిగా క్యాబినెట్ ఎజెండాలో చివరి అంశంగా పెట్టారు. అయినప్పటికీ కొందరు మంత్రులు దీన్ని వ్యతిరేకించారు.
భూములను అగ్గువగా కొట్టేసేందుకు, కారుచౌకగా అనుయాయులకు, బంధువులకు కట్టబెట్టేందుకే ఎస్ఆర్వో ధరలో 30 శాతానికే భూ బదలాయింపు చేయాలనే నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ భూములున్న పరిశ్రమల యజామానులతో బిగ్‌బ్రదర్స్ ముందే బలవంతపు ఒప్పందం కదుర్చుకొని, భూములు బదిలీ అయ్యాక రియల్ఎస్టేట్ వెంచర్స్ చేస్తారని తెలిసింది. నిండా మునిగాక చలి ఏందన్నట్టుగా, ఈ విషయం బయటికి రావటంతో ప్రభుత్వ పెద్దలు ఈ పాలసీపై ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వ పెద్దలు భూమాయను గోప్యంగా ముగించాలని భావించినా అసలు విషయాలన్నీ బయటపడ్డాయి. ప్రభుత్వం హిల్ట్ ఉత్తర్వులు విడుదల చేసిన 24 గంటల్లోనే కాలుష్య నియంత్రణ మండలి నుంచి పరిశ్రమలకు నోటీసులు అందాయి. కొన్ని పరిశ్రమలు కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయని, మూసివేయాలని ఇటీవల నోటీసులు ఇచ్చింది. పెద్దల ఒత్తిడితో ఈ భూములను కొనుగోలు చేసినా తిరిగి బిగ్బ్రదర్స్కే షరతుల మేరకు విక్రయించాలని, తిరిగి పరిశ్రమ ఏర్పాటుచేసుకొనేందుకు సొంతంగా సెజ్‌లలో భూములు కొనుగోలు చేయాలంటే డబ్బు సరిపోదంటూ పారిశ్రామిక వేత్తలు ఏం చేయాలతో తలలు పట్టకుంటున్నారు.
ఈ విషయం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లటంతోప్రభుత్వ పెద్దలు, బిగ్ బ్రదర్స్ షాక్‌కు గురయ్యారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సబ్‌కమిటీ సిఫారసులతోనే హిల్ట్ పాలసీని తీసుకొచ్చామని బుకాయించారు. ప్రభుత్వ తెరవెనుక సాగిస్తున్న దందా గురించి విషయాలు ఎలా లీక్ అవుతున్నాయో తెలుసుకునేందుకు ఏకంగా ఇంటెలిజెన్స్ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. వాస్తవానికి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో సబ్‌కమిటీ ప్రస్తావనే లేకపోగా, టీజీఐఐసీ సిఫారసు ఆధారంగా హిల్ట్ పాలసీని తెచ్చినట్టు పేర్కొన్నది.
వనరుల సమీకరణ కోసం ఏర్పాటైన సబ్‌కమిటీ సిఫారసుల్లో హిల్ట్ ప్రస్తావన ఎక్కడా లేదని, అసలు సబ్‌కమిటీ ఇటువంటి పాలసీ గురించి ఎక్కడా చెప్పలేదని పరిశ్రమవర్గాలు చెప్తున్నాయి. సబ్‌కమిటీ కాలుష్య పరిశ్రమలపై ఏదైనా నివేదిక ఇచ్చినా దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి సమక్షంలో స్టేక్ హోల్టర్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేసి తదుపరి చర్యలపై చర్చించాల్సి ఉంటుంది. అవేమీ లేకుండా నే ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకురావడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏదైనా పరిశ్రమ వల్ల కాలుష్యం జరిగినట్టు ఫిర్యాదులు వచ్చినా, ప్రభుత్వం భావించినా నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. కాలుష్యకారక పరిశ్రమలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సివస్తే అధ్యయనం నిర్వహించాలి. ఆ తర్వాత కాలుష్య ప్రభావం, నష్టాన్ని వివరిస్తూ నోటిఫికేషన్ జారీచేయాలి. కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించి, సంబంధిత పరిశ్రమల యజమానులతో సమావేశాన్ని నిర్వహించాలి. ఆ తర్వాత మార్గదర్శకాలు జారీచేసి చర్యలు చేపట్టాలి. కానీ, ఇవేమీ లేకుండానే ప్రభుత్వం ఇష్టారాజ్యంగా హిల్ట్ పాలసీకి అంకురార్పణ చేసి, పారిశ్రామికవేత్తల నెత్తిపై పిడుగు పడేసినంత పనిచేసింది. ‘ఇస్తారా.. చస్తారా’ అనే చందంగా పీసీబీ నుంచి నోటీసులు జారీ చేసి తక్షణమే వారు కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకునేలా ఒత్తిడి తెస్తున్నట్టు పరిశ్రమవర్గాలు చెప్తున్నాయి. దీన్నిబట్టి ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతున్నది.
ప్రభుత్వం కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ బయటకు పంపాలని అనుకుంటే, పారిశ్రామికవేత్తలు చెప్పినట్టుగా ఔటర్ బయట ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించేందుకు ఎందుకు అంగీకరించలేదని ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ సర్కారు ఫార్మాసిటీ కోసం దాదాపు 13,000 ఎకరాలు సేకరించింది. ఇందులో దేశంలోనే అతిపెద్ద, అత్యాధునిక ఫార్మాసిటీని ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పెద్దసంఖ్యలో పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఫార్మాసిటీని అటకెక్కించింది.
ప్రస్తుతం నగరంలోని పరిశ్రమలను తరలించాలని నిర్ణయించిన సర్కారు.. వారికి ఫార్మాసిటీలో సిద్ధంగా ఉన్న భూములను కేటాయించే అవకాశమున్నా అందుకు ఒప్పుకోవడంలేదు? ఔటర్ లోపల ఉన్న పరిశ్రమలన్నీ ల్యాండ్ కర్వర్షన్ చేసుకొని బయట ఎక్కడైనా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సీఎంవోలోని ఓ ముఖ్య అధికారి పారిశ్రామికవేత్తలపై ఒత్తిడి తెస్తున్నట్టు పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో ఔటర్ లోపల ఉన్న పరిశ్రమల నిర్వాహకుల పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే చందంగా తయారైంది. ఇదంతా కూడా ప్రభుత్వ పెద్దల దురుద్దేశాలకు నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఔటర్ లోపల ఉన్న 22 పారిశ్రామికవాడలను మల్టియూజ్ జోన్‌గా మార్చుకునే వెసులుబాటు కల్పిస్తూ ఈ నెల 22న ప్రభుత్వం హిల్ట్ పాలసీ ఉత్తర్వులు జారీచేసింది. కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ వెలుపలికి తరలించేలా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు అందులో స్పష్టంచేశారు. 2013లోనే కాలుష్య పరిశ్రమలను ఔటర్ వెలుపలికి తరలించాలని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు, అందుకు కొనసాగింపుగానే తాజాగా టీజీఐఐసీ ఎండీ పరిశ్రమల తరలింపునకు సిఫారసు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ ఉత్తర్వుల్లో ఎక్కడా కాలుష్యరహిత పరిశ్రమల తరలింపు గురించి, సబ్‌కమిటీ సిఫారసుల గురించి లేకపోవడం విశేషం.
హిల్ట్ పాలసీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఈ నెల 25న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ, వనరుల సమీకరణకు ఏర్పాటైన క్యాబినెట్ సబ్‌కమిటీ సిఫారసుల ప్రకారమే హిల్ట్ పాలసీని తెచ్చినట్టు, అంతేకాకుండా దీనిపై క్యాబినెట్లో మంత్రులు, అధికారులు సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే దీన్ని ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. ఢిల్లీ తరహాలో మన నగరంలో కాలుష్య సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతోనే దీన్ని తెచ్చినట్టు చెప్పారు. కాగా, ప్రభుత్వం జారీచేసిన హిల్ట్ ఉత్తర్వుల్లో మాత్రం టీజీఐఐసీ ప్రతిపాదన ప్రకారం హిల్ట్ పాలసీ తెచ్చినట్టు చెప్పారు. అందులో ఎక్కడా సబ్‌కమిటీ సిఫారసు ప్రకారం ఈ పాలసీని ప్రవేశపెట్టినట్టు లేకపోవడం గమనార్హం.