నైరుతి రుతుపవనాలు మాయమైనయ్.. తొలకరి పలకరించడమే లేదు.. ఎగువ గోదావరి ఎడారిని తలపిస్తున్నది. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి చుక్క నీరు లేక వెలవెలబోతున్నయ్. ప్రాణహిత కలిసే చోటు నుంచి దిగువ గోదావరి నీళ్లు దిగువకే జారిపోతున్నయ్. ప్రాణహితలో ఇప్పటికీ 3,300 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతున్నా ఎత్తిపోసే నాథుడు లేడు. ప్రస్తుతం తెలంగాణలో చుక్కనీటి జాడ లేదు. ఎవుసానికి నీళ్లు లేవు. తాగేందుకు నీళ్లు లేవు.
రాష్ట్రంలో 2015 తర్వాత కరువు ఛాయలు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నయ్. ఎల్‌నినో కారణంగా గడ్డు పరిస్థితులు దాపురిస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేసినా కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడలేదు. ఒక్క పిల్లరు కుంగిందన్న సాకుతో మేడిగడ్డను పడావు పెట్టి రైతుల నోటి కాడి బుక్కను ఎత్తగొట్టింది. నీటి కోసం మహారాష్ట్ర, కర్ణాటకను బిచ్చమెత్తుకోవాల్సిన దుస్థితి తెచ్చింది. బరాజ్‌కు మరమ్మతులు చేసి అందుబాటులోకి తెచ్చి ఉంటే రైతులకు గుండె నిబ్బరం ఉండేది.
కరువు వచ్చినా తెలంగాణ రైతు నీటి కోసం కష్టాలు పడకూడదన్న లక్ష్యంతో కట్టిందే కాళేశ్వరం.. ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి తెలంగాణ గట్టుకు మళ్లించాలన్న సంకల్పంతో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం నేటికి ఏడేండ్లు పూర్తి చేసుకున్నది. కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కక్షతో మేడిగడ్డను పక్కనబెట్టినా ప్రాజెక్టులో భాగమైన మిగతా పంపులు, రిజర్వాయర్లు, కాలువలే నేటికీ తెలంగాణకు జీవనాధారంగా నిలిచినయ్.
తెలంగాణకు జీవనాడి కాళేశ్వరమే..
కరువులో కాపాడే కల్పవల్లి కాళేశ్వరమే..
అందుకే అందరి కండ్లూ ఎదురుచూస్తున్నది
జల ప్రదాయని కాళేశ్వరం కోసమే..

హైదరాబాద్/హనుమకొండ, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈసారి తెలంగాణకు కరువు తప్పేలా లేదు. ఓవైపు వాతావరణ మార్పులు పగబడితే.. మరోవైపు ఉన్న ప్రాజెక్టును బాగు చేయకుండా రైతులపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు వస్తాయని, జూన్-జూలై, ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం బలహీనంగా ఉండే ప్రమాదం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. గోదావరిలో నీళ్లు లేకున్నా.. ఎండకాలంలోనూ జీననదిలా పారే ప్రాణహిత నీటిని ఒడిసిపట్టి కరువు నుంచి తెలంగాణను కాపాడేందుకు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కక్షతో పక్కనబెట్టింది. ఒక్క పిల్లర్ కుంగిందన్న సాకు చూపి మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేయకుండా వదిలేసి రైతుల ప్రయోజనాలను బలిపెట్టింది.

ఎల్‌నినో ఉన్న సంవత్సరాల్లో సాధారణంగా వర్షపాతం తగ్గి, ఎండలు ఎకువగా ఉండటం సాధారణం. నీటికొరత, పంటల దిగుబడి తగ్గడం, భూగర్భజలాల స్థాయి పడిపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఏర్పడుతాయి. కొన్నిప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొంటాయి. గతంలో 2002, 2009 వంటి ఎల్‌నినో సంవత్సరాల్లో దేశంలో తకువ వర్షపాతం నమోదైంది. తెలంగాణలోనూ తీవ్ర కరువు పరిస్థితులే నెలకొన్నాయి. ఆ సంవత్సరాల్లో ఎదురైన అనుభవాలు చూస్తే, ఎల్‌నినో ప్రభావం ఎంతతీవ్రంగా ఉంటుందో అర్థమవుతుంది. ప్రస్తుతం అదే ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ నివేదికలో వెల్లడించింది.
గత 25 ఏండ్లలో ఇదే అత్యల్ప లోటు వర్షపాతమని అంచనా వేసింది. సాధారణ వర్షపాతం కంటే 20 శాతం తక్కువ నమోదైతేనే లోటుగా నిర్ధారిస్తారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2015లోనూ లోటువర్షపాతమే నమోదైంది. తాగునీటికీ తండ్లాడిన దుస్థితి నెలకొన్నది. 2018లో తకువ వర్షాలు కురిశాయి. అటు తర్వాత సాధారణం కంటే అధిక వర్షపాతమే నమోదవుతూ వస్తున్నది. 2022లో అతిభారీ వర్షాలు కురిశాయి. 2025లోనూ సమృద్ధిగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం 2015లో లాగా తీవ్రంగా ఉండకపోయినా, గత 5-6 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు తకువ ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తున్నది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లు అడుగంటిపోయాయి. పెద్ద ప్రాజెక్టులే కాకుండా గోదావరి, కృష్ణా బేసిన్‌లోని మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులదీ ఇదే దుస్థితి. ఇక మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో చెరువులు, చెక్‌డ్యామ్‌ల్లోనూ నీటి నిల్వలు అందుబాటులో లేవని అధికారులే వెల్లడిస్తున్నారు. ప్రాజెక్టులు అడుగంటి పోవడంతో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. వానలు కురిసి వరదలు వస్తే తప్ప నీటినిల్వలు అందుబాటులోకి రావు. లేదంటే తాగునీటికి సైతం ప్రజలు తండ్లాడాల్సిన దుస్థితి నెలకొంటుంది.
గోదావరి నది మొత్తం పొడవు 1,465 కిలోమీటర్లు. గోదావరి మహారాష్ట్రలో పుట్టి.. తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరి ఆపై కడలిలో కలుస్తుంది. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చి సంగమించే ప్రాణహిత.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణలో ప్రవేశించి కలిసే ఇంద్రావతి, దిగువన ఏపీలోకి ప్రవేశించగానే వచ్చి చేరే శబరి.. ఇలా అనేకం ఉన్నాయి. గోదావరి నీటిలభ్యతలో ప్రాణహిత భాగస్వామ్యం సరాసరి 36 శాతం.. అంటే 1,000-1,400 టీఎంసీలు అన్నమాట. ఇక ఇంద్రావతి కలిస్తే ఇది 2,000-2,500 టీఎంసీల వరకు ఉంటుంది. మరి ఆ రెండు ప్రధాన ఉపనదులు తెలంగాణ పరిధిలోనే ప్రధాన గోదావరిలో కలుస్తాయి.
ఈ నేపథ్యంలో పెద్దపెద్ద ఇంజినీర్లు అవసరం లేదు. ఎవరినడిగినా ఆ రెండు ప్రధాన ఉపనదులు కలిసిన తర్వాత ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణ బీడు భూములను గోదారమ్మ పావనం చేస్తుందనే సత్యాన్ని చెప్తాడు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాలుగా జరిగిన తతంగం అందుకు భిన్నం. ఏలికలెవరైనా ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన వ్యూహం ఒక్కటే. ఎక్కడా చిన్న ఆటంకం లేకుండా, ఒక చుక్క గోదావరి కూడా తెలంగాణ గడ్డ మీద నిలబడకుండా ధవళేశ్వరం దాకా పరుగులు తీయాలనే కుతంత్రమే ఆ వ్యూహం. అందులో భాగంగానే తెలంగాణ చారిత్రక ప్రాజెక్టుల గొంతు నులిమారు. పుష్కలంగా నీటి లభ్యత ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి బేసిన్లను వదిలి నీరు లభించని ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను మభ్యపెట్టారు.
ఎగువ నుంచి వరద తక్కువైందని తెలిసినా శ్రీరాంసాగర్‌ను ఆధారం చేసుకొని వరద కాలువ.. దాని దిగువన ప్రధాన గోదావరిపై ఎల్లంపల్లి ప్రాజెక్టు, కడెంపై మరో ప్రాజెక్టు.. గుత్ప, అలీసాగర్ వంటి ప్రాజెక్టులు, ప్రాణహిత, ఇంద్రావతి వంటి కీలకమైన ఉపనదులు కలిసే ప్రాంతాలను వీడి గోదావరి ఉపనది అయిన మానేరుపై ఎగువ మానేరు, మధ్యమానేరు, దిగువ మానేరు ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించారు. మంజీరాపై అప్పటికే ఉన్న నిజాంసాగర్‌కు నిలువునా ఉరివేసినట్టుగా సింగూరు ప్రాజెక్టు కట్టి, పైగా దానిని హైదరాబాద్ తాగునీటి కోసమే కేటాయించారు. వాటి నిర్మాణంలో సుదీర్ఘ కాలయాపన చేశారు. ఎగువ రాష్ర్టాలు ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు నిర్మించడంతో నీటిలభ్యత తగ్గి వేలకోట్లు వెచ్చించి కట్టిన తెలంగాణ ప్రాజెక్టులతో ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది.

ఉమ్మడి రాష్ట్ర కుట్రలను ఛేదించి, తెలంగాణకు శాశ్వత కరువును నివారించేందుకు రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద 2016 మే 2న ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, 2019 జూన్ 21న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నాటి నుంచి ప్రాజెక్టు బహుముఖ ప్రయోజనాలను అందిస్తూనే ఉన్నది.
గోదావరి తీరంలో ఎక్కడా గట్టిగా ఒక్క వాన కూడా కురువలేదు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి మొదలు దిగువ ఉన్న పార్వతి, సరస్వతి బరాజ్‌లకు ఎగువ నుంచి చుక్క నీరు రావడం లేదు. అయినా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీబరాజ్ (మేడిగడ్డ) వద్ద భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. బరాజ్ వద్ద నీటి ప్రవాహం మొదలైంది.
అదే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంచుకున్న ప్రదేశం. ప్రాజెక్టుకు వరదలో ఓ ప్రత్యేకత ఉన్నది. ఇప్పుడు కూడా అక్కడ రోజూ నీరు వచ్చి చేరుతున్నది. ఒక్క పెద్ద వాన పడకున్నా సగటున 3,300 క్యూసెక్కుల నీరు వస్తున్నది. లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ) వద్ద శనివారం సాయంత్రానికి 4,200 క్యూసెక్కులకు ప్రవాహం పెరిగింది. అంటే మూడురోజులకు ఒక టీఎంసీని తరలించుకునే అవకాశం ఇప్పటికీ అక్కడ ఉండటమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి గొప్ప బలం. కేసీఆర్ దూరదృష్టికి తార్కాణం. ఫలితంగానే 2019 నుంచి నీటిని ఒడిసి పట్టి అత్యధిక ప్రాంతానికి సాగు, తాగునీరు అందించడం సాధ్యమవుతున్నది.
ఈ ఒక్క ప్రాజెక్టుతో గోదావరిలో మన 954 టీఎంసీల్లో 750 టీఎంసీలకు పైగా వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. ప్రాణహిత జలాలను ఎదురెక్కించడం వల్ల 150 కిలోమీటర్ల ప్రధాన గోదావరి సజీవంగా మారింది. తొలుత జాప్యం.. ఇప్పుడు హడావుడివాతావరణ శాఖ హెచ్చరికలు.. కమ్ముకుంటున్న కరువు మేఘాలతో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ మీద దృష్టి పెట్టింది. రెండున్నరేండ్లుగా బరాజ్‌ను పక్కనబెట్టి నీటిని ఎత్తిపోయకుండా చోద్యం చూసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీబరాజ్ (మేడిగడ్డ)లోని 7వ బ్లాక్‌లోని 20 పిల్లర్ గత అక్టోబర్‌లో కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే. ప్రాజెక్టుపై ఆది నుంచీ అక్కసు వెళ్లగక్కుతున్న కాంగ్రెస్, బీజేపీ ఇదే అదునుగా కుమ్మక్కు రాజకీయాలకు తెరతీశాయి.
ఇన్వెస్టిగేషన్, సాంకేతిక పరీక్షలు నిర్వహించకముందే డిజైన్ లోపాలు, నాణ్యతా లోపాలు అంటూ విషప్రచారం చేస్తూ వచ్చాయి. ఏజెన్సీలపై భారం మోపుతూ రావడంతో టెస్టుల నిర్వహణ ముందుకు సాగలేదు. ఆ తర్వాత నిరుడు అక్టోబర్‌లో టెస్టుల నిర్వహణ, పునరుద్ధరణ పనుల కోసం కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయించింది. ఆ ప్రక్రియను సైతం తీవ్ర జాప్యం చేసింది. తుదకు గత జనవరిలో పునరుద్ధరణ డిజైన్ల బాధ్యతలను ఆఫ్రీ, ఐఐటీ చెన్నైకి అప్పగించింది. అప్పటికీ పనులను వెంటనే ప్రారంభించిందా అంటే అదీ లేదు. బరాజ్ పునరుద్ధరణ పనుల ప్రక్రియలో జాప్యంపై ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్‌జైన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, సర్కార్‌ను నిలదీశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అయినా రిపోర్ట్ వచ్చేనాటికే వానకాలం వచ్చేసిందని, ఫలితంగానే పరీక్షలు సాధ్యపడలేదని సర్కార్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నది. గత జనవరి నుంచి టెస్టులు ప్రారంభించామని, టెస్టుల విషయంలో తమకు ఓ రోడ్ మ్యాప్ ఇవ్వాలని, అందుకు అనుగుణంగా పనులు చేస్తామని తిరిగి ఎన్డీఎస్ఏనే కాంగ్రెస్ ప్రభుత్వం కోరిందంటే పనులపై ఏపాటి పట్టింపు ఉన్నదో స్పష్టంగా తెలిసిపోతున్నది. తాజాగా వాతావరణశాఖ హెచ్చరికలు రాగానే సర్కారు కొద్దిరోజుల నుంచి హడావుడి చేయసాగింది. మే నెలాఖరు నుంచే ప్రాణహితలో ప్రవాహాలు మొదలవుతాయి. 10 నెలల పాటు కనీస సగటు ప్రవాహాలు కొనసాగుతాయి. బరాజ్ వినియోగంలో ఉంటే నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉండేది. కానీ సర్కార్ ఇప్పటివరకు ఆ పని చేయలేదు.

తెలంగాణ ఉద్యమ నినాదాల అమలుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. సాగునీటి రంగాన్ని బలోపేతం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర సాగునీటి స్వరూపాన్ని పూర్తిగా మార్చేలా కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసింది. దశాబ్దాల వివాదాలకు స్వస్తి పలుకుతూ 2016 మార్చి 8న మహారాష్ట్ర ప్రభుత్వంతో గోదావరి నీళ్లపై ఒప్పందాలు కుదుర్చుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ ఒప్పందంతోనే పునాదులు పడ్డాయి. 2016 మే 2న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నెపల్లి వద్ద భూమి పూజ చేసి ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. మూడేండ్లలోనే ప్రాజెక్టులోని ప్రధాన బరాజ్‌లు, పంపుహౌస్‌లు, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టును 2019 జూన్ 21న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. నేటికీ.. ఏనాటికీ తెలంగాణకు కాళేశ్వరమే జీవనాడిగా నిలిచింది.

3 బరాజ్‌లు
15 రిజర్వాయర్లు
19 సబ్స్టేషన్లు
21 పంప్‌హౌస్‌లు
203 కిలోమీటర్ల సొరంగాలు
1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్
98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్
530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్
240 టీఎంసీల నీటి వినియోగం
ఎస్సారెస్పీ స్టేజ్-1 (ఎల్ఎండీ), ఎస్సారెస్పీ స్టేజ్-2, నిజాంసాగర్‌కు నీరందించి 17, 08, 230 ఎకరాలు
కాళేశ్వరం నీళ్లు కూడవెళ్లి వాగు, హల్దీవాగుల ద్వారా 66 చెక్‌డ్యామ్‌లతో 20, 576 ఎకరాలకు సాగునీరు
మొత్తం 141 టీఎంసీలు

కాళేశ్వరం అందుబాటులో వచ్చిన తర్వాతే గోదావరి బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులకు జీవం వచ్చింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు, కాలువలు మౌలిక వసతుల ద్వారా నీటికి ఢోకా లేకుండా పోయింది. ప్రాజెక్టులను చెరువులతో అనుసంధానించి నిరంతరాయంగా నింపడం వల్ల భూగర్భజలాలు పెరిగి బోరుబావుల కింద ఎవుసం పండగలా మారింది. మొత్తంగా తెలంగాణలో రెండు పంటలకు భరోసా లభించింది. మేడిగడ్డను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టినా మిగతా నీటిసరఫరా వ్యవస్థ ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మసాగర్ వరకు యథావిధిగా పనిచేస్తున్నది.
బరాజ్‌లు మినహా రిజర్వాయర్లన్నీ ఉనికిలోనే ఉన్నాయి. ఫలితంగానే ఆయా ప్రాజెక్టుల కింద సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. కాంగ్రెస్ వచ్చాక నీటి ఎత్తిపోతలను నిలిపేసింది. అదే సమయంలో రెండేండ్లుగా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. అయినా సూర్యాపేట జిల్లాతోపాటు ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడంలో సర్కార్ విఫలమైంది. మేడిగడ్డకు మరమ్మతులు చేసి ఉంటే, ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ప్రాజెక్టు ఫలాలు రైతాంగానికి, తెలంగాణకు అంది ఉండేవి. కానీ సర్కార్ ఆపని చేయకపోవడంతో ప్రాణహితలో తరలిపోతున్న జలాలను చూస్తూ రైతాంగం తల్లడిల్లాల్సిన దుస్థితి నెలకొన్నది.