మంచిర్యాల : సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రేపు జిల్లాలోని కాంట చౌరస్తా వద్ద నిర్వహించబోయే దీక్షను విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు.
బెల్లంపల్లి నియోజకవర్గంలోని అబ్బాపూర్ మైన్ వద్ద గేట్ మీటింగ్‌కి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిన్నయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మణిహారం లాంటి సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నది.
సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పొట్టకొట్టడానికి సిద్ధమైంది. ఈ కార్మిక వ్యతిరేక చర్యలను కార్మికులంతా కలసి ఏకమై ఉద్యమించి కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి. తద్వారా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి సింగరేణి ప్రైవేటీకరణను ఆపాలని కోరారు.
ఈ ఉద్యమంలో సింగరేణి కార్మికులు, ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులమైన తాము కూడా భాగస్వామ్యం అవుతామని, అలాగే రేపు జరిగే నిరాహార దీక్షకు సింగరేణి కార్మికులు, ఉద్యోగులు అందరూ హాజరై విజయవంతం చేసి మన ఐక్యతను ఢిల్లీ వరకు చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మాళ్రాజు శ్రీనివాసరావు, టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ధరావత్ మంగిలాల్, మెరుగు రమేశ్, అన్నం లక్ష్మయ్య, రాజేశం, గురుజల రమేశ్, తదితరులు పాల్గొన్నారు.