అమరావతి: విశాఖస్టీల్‌ను పరిరక్షించాలని, సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ (Visakha Steel ) విలీనం చేయాలని కోరుతూ ఆదివారం ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ రన్ చేయాలని కోరుతూ అగనంపూడి నుంచి గాజువాక వరకు మానవహారం( Human denominator ) నిర్మించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలో ‘ చేయి చేయి కలుపుదాం.. ఉక్కు పరిశ్రమను కాపడుతామంటూ ’ నినాదాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు. కేంద్రం (Union Government) ప్లాంట్‌ను రక్షించడం కంటే పరిశ్రమను ఎలా నాశనం చేయాలనే చూస్తుందని ఆరోపించారు. దుర్మార్గమైన చర్యలు తీసుకుంటున్న కేంద్రం నిర్ణయాన్ని ఆంధ్రప్రజలు ఖండిస్తున్నారని వెల్లడించారు.
ఈ నెల 8వ తేదీన ఢిల్లీలో జరుగనున్న సమావేశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా విశాఖలోని కూర్మన్న పాలెం గ్రామంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన రిలే దీక్షలు 1,333 రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని సీపీఐ , సీపీఎం నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.