అదో పాత పెంకుటిల్లు. ఎందరో నిరుద్యోగులకు నీడనిచ్చి వారి భవిష్యత్‌కు సరికొత్త బాటలు వేసింది. తన ఒడిలో చదువుకున్న వారికిడ ‘నమ్మక’మిచ్చి కలలను సాకారం చేసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 55 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా తోడ్పడింది. యువతకు కొలువుల నిలయంగా మారి ప్రత్యేకతను చాటుకుంటున్న మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లికి చెందిన పులి రాజమల్లు గౌడ్‌కు చెందిన ఇంటి గురించి మీ కోసం..
తాండూర్ మండలం బోయపల్లికి చెందిన పులి రాజమల్లు కొత్త ఇల్లు కట్టుకోవడంతో పాత పెంకుటిల్లు(2012లో)ను వదిలేశాడు. గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు అందులో చదువుకుంటామని అడిగితే ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వం పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయగా, ఇందులో చదివిన ఐదుగురు యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఆ తర్వాత దానిని పూర్తిగా నిరుద్యోగులు చదువుకునేందుకు వదిలేశాడు రాజమల్లు. అప్పటి నుంచి బోయపల్లిలోని నిరుద్యోగులంతా ఇక్కడకు వచ్చి చదువుకోవడం అలవాటుగా మారింది. ఇక్కడ చదువుకుంటే ఉద్యోగం వస్తుందన్నది వీరి నమ్మకంగా మారింది. ఈ చిన్న గుడిసెలో కేవలం రెండే గదులు ఉంటాయి. కొందరు లోపల కూర్చుండి చదువుకుంటే.. మరొకొందరు చెట్ల కింద కూర్చొని పుస్తకాలతో కుస్తీ పడుతారు. ఇప్పటి వరకు ఇక్కడ చదువుకున్న వారిలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గమనార్హం. ఉద్యోగాలు సాధించిన వారు, పలువురు దాతలు నిరుద్యోగులకు కావాల్సిన పుస్తకాల(500 బుక్స్)ను అందుబాటులో ఉంచుతున్నారు. అన్ని స్టడీ సెంటర్లలో ఉన్న మెటీరియల్స్ ఇక్కడ ఉండడం విశేషం.
ఇక్కడ చదివి ఉద్యోగం సంపాదించిన వారు వారంలో ఏదో ఒకరోజు వచ్చి నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్కావాలో అవగాహన కల్పిస్తారు. అదే సమయంలో నమూనా ప్రశ్నాపత్రాలు తయారు చేసి పరీక్షలు నిర్వహిస్తారు. పక్కా ప్రణాళిక ప్రకారం నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. దీంతో ఇక్కడి వారు రాటుదేలుతున్నారు. కేవలం ఈ చిన్న గ్రామం (1187 జనాభా) నుంచి ఇప్పటి వరకు 55 మంది ఉద్యోగాలు సాధిం చడం గమనార్హం. మరో విశేషమేమి టంటే ఇక్కడ చదువుకొని ఉద్యోగం వచ్చిన వారి స్ఫూర్తితో ఇంటి యాజమాని రాజమల్లు సైతం తపాలాశాఖలో కొలువు సాధించాడు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 80 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశ నెలకొంది. సీనియర్ల సహకారంతో ఎలాంటి కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. పెంకుటింట్లో ఉన్న స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 18 మంది నిరుద్యోగులు చదువుకుంటున్నారు. మున్ముందు సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.
నేను ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో చదువుతున్న. ఇక్కడున్న స్టడీ మెటీరియల్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్న. ప్రతి రోజూ ఇక్కడికి వచ్చి చదుకుంట. సీనియర్ల సూచనలతో ఉద్యోగం సాధిస్తా.
డిగ్రీ పూర్తి చేసిన. ఆర్ఆర్బీ జాబ్‌కు ప్రిపేర్ అవుతున్న. మా నాన్న రోజూ కూలీ పని చేసి కుటుంబాన్ని పోషిస్తాడు. వేలకు వేలు పెట్టి కోచింగ్ సెంటర్‌కు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో నేను ఇక్కడే చదువుకుంటున్న. ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు సాధించిన వారి సలహాలు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఉద్యోగం సంపాదించే విషయంలో మెళకువలు నేర్పిస్తున్నారు. వారికి ఎంతో రుణపడి ఉంటాం.
– సుంకరి మనోజ్, తాండూరు
డిగ్రీ పూర్తి చేసిన. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదువుకుంటున్నా. మా చిన్న అన్నయ్య నాగరాజు జూనియర్ లైన్మెన్గా ఉద్యోగం చేస్తున్నారు. పెద్దన్నయ్య రాజేశం ప్రభుత్వ టీచర్‌గా ఎంపికయ్యారు. వారి స్ఫూర్తితో నేను కూడా జాబ్ కొడుతా. అందుకే రోజూ పది గంటలు కష్టపడి చదువుకుంటున్నా.
– మంచర్ల వెంకటేశ్, తాండూర్
డిగ్రీ పూర్తి చేసిన. డిఫెన్స్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా. ఇక్కడ చాలా పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా సీనియర్ల సహకారం బాగుంది. వారు అనేక మెళకువలు నేర్పు తున్నారు. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమ వ్వాలో అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ చదువుకుంటే ప్రశాంతంగా ఉంటుంది.
– చొక్కాల శివ ప్రసాద్, బోయపల్లి, తాండూర్
సీజీఎల్ పూర్తి చేసిన. నేను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ చదువుకుంటే కచ్చితంగా ఉద్యోగం వస్తుందనేది నమ్మకం. నమ్మకం మాట ఎలా ఉన్నా కష్టపడి చదివితేనే ఫలితముంటుంది. సీనియర్ల సహకారం మరువలేనిది. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యోగం సాధిస్తా.
– పుర్ర మహేశ్, బోయపల్లి, తాండూర్