న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: హిజాబ్ వివాదం మరింత ముదురుతున్నది. కర్ణాటకలోని తుమకూరులో ఉన్న గర్ల్స్ ఎంప్రెస్ గవర్నమెంట్ పీయూ కాలేజీలో హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులను క్యాంపస్‌లోకి అనుమతించలేదు. హిజాబ్‌పై బ్యాన్ ఎందుకని పది మంది విద్యార్థినులు నిరసన చేపట్టారు. సెక్షన్ 144ను అతిక్రమించారని వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అదేవిధంగా శివమొగ్గ జిల్లాలోని శిరలకొప్ప ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కాలేజీలో 58 మంది విద్యార్థినులను సస్పెండ్ చేశారు. హిజాబ్ ధరించినా కాలేజీలోకి అనుమతించాలని ఆందోళన చేపట్టారు. వారిపై చర్యలు తీసుకొన్నట్టు కాలేజీ యాజమాన్యం తెలిపింది. అటు.. అదే రాష్ట్రంలో మరో చోట ఓ విద్యార్థి నుదుట బొట్టు పెట్టుకొని కాలేజీకి వచ్చాడు. దాన్ని గమనించిన అధికారులు.. అతన్ని గేటు వద్దే నిలిపేసి బొట్టు తీసేసి వస్తేనే కాలేజీలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. మైసూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ యునిఫాం నిబంధనను తొలగించి, హిజాబ్ ధరించి కాలేజీకి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
హిజాబ్ ధరించి ఓటు వేయొద్దన్న బీజేపీ ఏజెంట్
హిజాబ్ ధరించి ఓటు వేసేందుకు వచ్చిన ఓ మహిళను బీజేపీ ఏజెంట్ అడ్డుకొని, హిజాబ్‌పై అభ్యంతరం తెలిపాడు. దీంతో అతన్ని బూత్ నుంచి పంపించేసిన ఘటన తమిళనాడులోని మేలూరు మున్సిపాలిటీలో చోటుచేసుకొన్నది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పట్టణంలోని అల్ అమీన్ హై స్కూల్లో పోలింగ్ జరిగింది. ఓ మహిళ హిజాబ్ ధరించి ఓటు వేయడానికి వచ్చింది. అక్కడే ఉన్న బీజేపీ ఏజెంట్ గిరిరాజన్ హిజాబ్‌పై అభ్యంతరం తెలిపాడు.