మేడ్చల్, మే4 (నమస్తే తెలంగాణ): సినీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులు బుధవారం బోయిన్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మల్లారెడ్డిని కలిసి సినీ కార్మికులకు ఈఎస్ఐ కార్డులు, ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ…‘సినీ కార్మికులకు కార్మికశాఖ నుంచి ఈఎస్ఐ కార్డులు, ప్రమాదబీమా సౌకర్యం కల్పించే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తా. ప్రభుత్వం సినీ కార్మికులకు అండగా ఉంది. మీకు రోజూ పని కల్పించే విధంగా పూర్తిగా సహకరిస్తాం’ అన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఫెడరేషన్ సెక్రటరీ వీఎన్. ఆదిత్య, రైటర్ యూనియన్ సెక్రటరీ అనురాధ, డైరెక్టర్లు కాదంబరి కిరణ్, శ్రీనాధ్, ప్రేమ్‌రాజ్, ఏలూరు మల్లిఖార్జున్, అనుమోలు కృష్ణ, ఈవీవీ సత్తిబాబు, బత్తిన ఠాగూర్, వడ్డణం రమేశ్, కేఎల్. ప్రసాద్, బందూక్ లక్ష్మణ్, విజయ్ శేఖర్ తదితరులు ఉన్నారు.