–గాంధీ దవాఖానాను సందర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
-రాష్ట్ర మహిళా కమీషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
బన్సీలాల్‌పేట్ : మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమీషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె కమీషన్ సభ్యురాలు షబానా అఫ్రోజ్‌తో కలిసి గాంధీ దవాఖానాను సందర్శించారు. ఈ సందర్భంగాసూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావును కలిసి అత్యాచార ఆరోపణ సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ఆరోపణలు నిజమేనా, రేడియాలజీ విభాగంలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న నిందితుడు ఎలాంటి వాడు, సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బయటి రోగుల విభాగం పక్కన రోగి సహాయకుల వెయిటింగ్ హాలు వద్దకు వెళ్ళారు. పోలీసు అవుట్‌పోస్ట్ పక్కనే, నిత్యం వందలాది మంది తిరిగే ప్రదేశంలో ఈ ఘటన జరిగిందని ఆరోపణలు రావడం ఆశ్చర్యంగా ఉందని, ఏదేమైనా పోలీసుల విచారణ జరుగుతుందని, నిజానిజాలు త్వరలోనే బయటపడతాయని ఆమె అన్నారు. తాను స్వయంగా బాదితురాలిని కలుస్తానని, ఆమెకు మంచి వైద్యం అందించి, అన్ని విధాలుగా ఆదుకుంటామని, నిందితులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా శిక్ష పడేలా చూస్తామని అన్నారు.
రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కూడా మంగళవారం గాంధీ దవాఖానకు వెళ్ళారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, చిలకలగూడ ఇన్స్పెక్టర్ జి.నరేశ్, డీఐ సంజయ్ కుమార్‌లతో సమావేశమయ్యారు. సంఘటన వివరాలను తెలుసుకున్నారు. మహిళల రక్షణలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని మంత్రి అన్నారు. బాదితులు తమ మహబూబ్‌నగర్ జిల్లా వాసులేనని, త్వరగా దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. బాదిత మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు మాట్లాడుతూ దవాఖానలో 189 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, వాటి రికార్డులను పోలీసులు, తమ సిబ్బంది కలిసి పరిశీలిస్తున్నారని అన్నారు. తమ దవాఖానలో డార్క్ రూమ్‌లు ఎక్కడా లేవని, 24 గంటలు పనిచేసే సెక్యూరిటి వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. నిజానిజాలు త్వరలోనే బయట పడతాయని, అప్పటి వరకు మీడియాలలో దవాఖాన ప్రతిష్ట దిగదార్చేలా అభ్యంతకరమైన హెడ్డింగులతో వార్తలు రాసి, ప్రజలను భయాందోళనకు గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. నిజనిర్థారణ కోసం దవాఖాన డిప్యూటి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నర్సింహారావు నేత, గైనకాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ మహాలక్ష్మి, ఆర్ఎంఓ లు డాక్టర్ నరేంద్ర కుమార్, డాక్టర్ పద్మలతో కూడిన నలుగురు సభ్యుల కమిటిని ఏర్పాటు చేశామని తెలిపారు.