స్మృతి మందన, హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులో శివతాండవం ఆడిన వేళ.. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో స్ట్రయిక్ రొటేట్ చేసేందుకు నానా తంటాలు పడ్డ మన అమ్మాయిలు ఈ మ్యాచ్‌లో బాదుడే పరమావధిగా కరీబియన్లపై విరుచుకుపడ్డారు. ఆనక బౌలింగ్‌లో తలోచేయి వేయడంతో మెగాటోర్నీలో రెండో గెలుపు నమోదు చేసుకున్న మిథాలీ బృందం.. పాయింట్ల పట్టికలో టాప్కు దూసుకెళ్లింది!
హామిల్టన్: గత మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో పలు సందేహాలు రేకెత్తించిన భారత జట్టు.. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శనివారం వెస్టిండీస్‌తో జరిగిన పోరులో విశ్వరూపం కనబర్చింది. బ్యాటింగ్‌లో స్టార్ ఓపెనర్ స్మృతి మందన (119 బంతుల్లో 123; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), సీనియర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ (107 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు బాదడంతో భారీ స్కోరు చేసిన మిథాలీ బృందం బౌలింగ్‌లో సమిష్టిగా సత్తాచాటింది. ఫలితంగా మూడో మ్యాచ్‌లో టీమ్ఇండియా 155 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట నెగ్గిన భారత్.. మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. శనివారం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ బృందం నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో విండీస్ 162 పరుగులకే కుప్పకూలింది. డాటిన్ (62), హీలీ మాథ్యూస్ (43) రాణించడంతో ఒక దశలో వంద పరుగుల వరకు వికెట్ కోల్పోని విండీస్.. 62 పరుగుల వ్యవధిలో ఆలౌట్ కావడం గమనార్హం. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3 వికెట్లు పడగొట్టింది.
భారత్: 50 ఓవర్లలో 317/8 (స్మృతి 123, హర్మన్‌ప్రీత్ 109; అనీస 2/59),
వెస్టిండీస్: 40.3 ఓవర్లలో 162 ఆలౌట్ (డాటిన్ 62; స్నేహ్ రాణా 3/22).