హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతున్నది. ఈ పెరుగుదల దేశ సగటు కంటే చాలా ఎక్కువగా ఉన్నది. ఈ ఏడాది ఆరంభం నాటికి తెలంగాణ జనాభాలో 1.79 కోట్ల (46.84 శాతం) మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశ సగటు (34.75 శాతం) కంటే ఇది దాదాపు 12% అధికం. 2036 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా మరో 10.48 శాతం పెరిగి 2.20 కోట్లకు (57.32 శాతానికి) చేరుతుందని, ఇదే సమయంలో దేశ పట్టణ జనాభా 39.06 శాతంగా ఉంటుందని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ అంచనా వేసింది. తద్వారా దేశ సగటు కంటే తెలంగాణ పట్టణ జనాభా దాదాపు 18 శాతం అధికంగా ఉంటుందని లెక్కగట్టింది.
రాష్ట్ర పట్టణ జనాభాలో హైదరాబాద్ జిల్లా (100 శాతం) అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
ద్వితీయ స్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి (91.5 శాతం), తృతీయ స్థానంలో వరంగల్ (68.5 శాతం) జిల్లాలు ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లాలో 57.7%, మంచిర్యాల జిల్లాలో 43.9%, పెద్దపల్లి జిల్లాలో 38.2%, సంగారెడ్డి జిల్లాలో 34.7% మంది పట్టణాల్లో నివసిస్తున్నారు.
