కేంద్ర బడ్జెట్‌పై భగ్గుమన్న టీఆర్ఎస్ నాయకులు
బడ్జెట్ ప్రతులు దహనం చేసిన టీఆర్ఎస్వై
తెలంగాణపై కేంద్రం వివక్షను ఎండగట్టిన నేతలు
నిరుద్యోగ సమస్యను విస్మరించడంపై ఆగ్రహం
బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణపై కేంద్రం చూపిన వివక్షపై బుధ వారం టీఆర్ఎస్ నేతలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ యువజన విభాగం నేతలు నిరసన వ్యక్తం చేశారు.. ప్రధాన రహదారుల్లో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.. వామపక్ష పార్టీల నాయకులు పలు చోట్ల ఆందోళన నిర్వహించారు.. కేంద్ర ఏకపక్ష వైఖరిని ఎండగట్టారు. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
ఖమ్మం, ఫిబ్రవరి 2: బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదని టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య అన్నారు. పార్లమెంట్లో ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలనూ నిరాశకు గురి చేసిందని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఖమ్మంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు బడ్జెట్ ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ బడ్జెట్లో యువత స్వయం ఉపాధి కల్పనకు కేటాయింపులు జరగలేదన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఒక్కసారి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని, ప్రైవేటు రంగంలో లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. టీఆర్ఎస్ యువజన విభాగం నగర అధ్యక్షుడు దేవభక్తిని కిశోర్, ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్‌కుమార్, బలుసు మురళీకృష్ణ, గోపిచంద్, బాజీబాబా, బోజెడ్డ దీలిప్ పాల్గొన్నారు.