హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని అపాయింటెడ్ డే ప్రకటించాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన జేఏసీ అత్యవసర సమావేశంలో వారు మాట్లాడారు.
ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేయాలని ఈ భేటీలో నిర్ణయించినట్టు వెల్లడించారు. సీఎం సూచన మేరకు ఎన్నికల కంటే ముందు విలీనం చేయాలని అన్ని సంఘాలు వినతిపత్రాలు ఇచ్చినందున సీఎం చొరవ చూపాలని కోరారు. కార్మిక సంఘాలకు ముందు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కన్వీనర్ మౌలానా, కో కన్వీనర్లు యాదయ్య, సురేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.