ఖైరతాబాద్, సెప్టెంబర్ 20: ఓ హృద్రోగికి గుండె మార్పిడి చేసి నిమ్స్ వైద్యులు పునర్జన్మనిచ్చారు. గుండె సర్జరీ జరిగిన రోజునే తన పుట్టినరోజుగా నిర్ణయించుకొని వైద్యులు, సిబ్బంది సమక్షంలోనే తొలి బర్త్ డే వేడుక జరుపుకొన్నాడు ఓ వ్యక్తి. ఖమ్మం జిల్లాకు చెందిన హుస్సేన్ పెయింటర్. గుండె సమస్యలతో నిమ్స్ వైద్యులను సంప్రదించారు. పరీక్షలు జరిపి హార్ట్ ఫెయిల్యూర్‌గా నిర్ధారించారు. గుండె మార్పిడి ఏకైక మార్గమని చెప్పారు. దాంతో హుస్సేన్ జీవన్‌దాన్ కింద దరఖాస్తు చేసుకొన్నారు.
సమస్య తీవ్రం కావడంతో నిరుడు ఆగస్టులో నిమ్స్‌లో చేరారు. గత ఏడాది సెప్టెంబర్ 15న బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి గుండెను నిమ్స్ కార్డియో థోరాసిక్ సర్జన్ డాక్టర్ అమరేశ్, డాక్టర్ పీఎస్ సత్యగోపాల్ నేతృత్వంలోని వైద్యుల బృందం హుస్సేన్‌కు అమర్చారు. మొత్తం చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేశారు. ప్రస్తుతం హుస్సేన్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. మంగళవారం హుస్సేన్ సతీసమేతంగా నిమ్స్ కు వచ్చి, తనకు పునర్జన్మచ్చిన వైద్యులు, జీవన్‌దాన్ ప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. ఇకపై ప్ర తిఏటా సెప్టెంబర్ 15న తన పుట్టినరోజు జరుపుకుంటానని హుస్సేన్ తెలిపారు. హుస్సేన్‌కు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ అమరేశ్, డాక్టర్ పీఎస్ సత్యగోపాల్, జీవన్‌దాన్ తెలంగాణ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.