కరోనా నేపథ్యంలో మార్కెట్ అనిశ్చితికి 2020 అద్దం పడితే.. అటు వ్యాపారాల్లో, ఇటు వినియోగదారుల్లో మార్పునకు 2021 నాంది పలికింది.
ఈ క్రమంలోనే 2022లో షాపింగ్‌కు ప్రాధాన్యత ఉంటుందని మార్కెట్ పండితులు చెప్తుండగా, ఈ ఏడాది కొనుగోళ్లు పెరుగుతాయని ఆర్థిక నిపుణులూ అంచనా వేస్తున్నారు.
అందుకే కస్టమర్లకు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఖర్చులపై సలహాలు, సూచనలు
ఇస్తున్నారు. మరి మీరూ ఓ లుక్కేయండి..
కరోనా మహమ్మారి మనందరి జీవితాలను ప్రభావితం చేసింది. ఆదాయాలు తగ్గడంతో.. అంతా ఖర్చుల విషయంలో జాగ్రత్తపడుతున్నారు. అయితే ప్రతీ ఖర్చుకో లెక్కుంది అంటున్నారు నిపుణులు. వివేకవంతమైన వ్యయాలతో లాభాలూ ఉన్నాయని చెప్తున్నారు. అవసరాలను గుర్తించి ఖర్చు చేయాలంటున్నారు. రోజువారీ అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలి.
నాణ్యతకే పెద్దపీట
ఎలక్ట్రానిక్స్, ఇతర గృహోపకరణాలను కొనేటప్పుడు దాని పరిమాణం, విలువ కంటే నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అందులోని సౌకర్యాలను పరిశీలించి కొంటే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. మారుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని షాపింగ్ చేయడం తెలివైన పని. వస్తువు పెద్దదైనకొద్ది దానికి పెట్టే ఖర్చూ పెద్దగానే ఉంటుంది. కాబట్టి మన అవసరం ఎంతో అంతకు తగ్గట్టున్న వస్తువునే కొనడం ఉత్తమమని మరువద్దు.
ఆర్థిక భారం పడొద్దు
కొనే ప్రతీ వస్తువు ధరను ఇటు ఆఫ్‌లైన్ మార్కెట్.. అటు ఆన్లైన్ మార్కెట్లో పోల్చి చూడండి. అప్పుడే లాభదాయకం. అలాగే సులభ వాయిదా పద్ధతులు, వడ్డీ రహిత ప్రయోజనాలను పరిశీలించండి. మార్కెట్లో ఇప్పుడు ‘బై నౌ పే లేటర్’ ఆఫర్లూ ఉంటున్నాయి. మీకు క్రెడిట్ కార్డులుంటే వాటిని వినియోగించుకుని ప్రోత్సాహకాలను అందుకోవచ్చు.
సొంత వాహనమా..
కరోనా నేపథ్యంలో సొంత వాహనాలపై అందరి దృష్టి పడింది. సురక్షిత ప్రయాణాన్ని కోరుకోవడం, ఇంధన ధరలు పెరగడం, చార్జీల భారంతో అంతా కార్ల వైపు చూస్తున్నారు. ఇలాంటివారికి
సీఎన్జీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఉత్తమం. ధర ఎక్కువైనా.. ఆ తర్వాత వాటికయ్యే మెయిం టనెన్స్ ఖర్చు తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇవి మైలేజీ ఎక్కువగా ఇస్తాయి.
బీమాకు ప్రాధాన్యం
ప్రస్తుత పరిస్థితుల్లో బీమాకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ఆరోగ్య బీమా తప్పనిసరి. దీనివల్ల అత్యవసర సమయాల్లో మీకు ఎంతో ఆర్థిక దన్ను లభిస్తుంది. అన్నింటికీ కవరేజీ దక్కే ప్లాన్‌నే ఎంచుకోవాలి. జీవిత బీమా కూడా ముఖ్యమే. మరణానంతరం మన కుటుంబానికి కొండంత ధైర్యాన్నిస్తుంది.
పన్నుల ఉచ్చు
వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నెల 1న పార్లమెంట్లో ప్రకటించిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పన్నుల ఉచ్చు వేసింది. ముఖ్యంగా టీడీఎస్‌కు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ప్రవేశపెట్టింది. ఇవి పన్ను వసూలు ప్రక్రియను మరింత విస్తరించాయి. పన్ను చెల్లింపుదారులు తమ పన్నును చెల్లించడానికి ముందే వారి ఆదాయ వనరు దగ్గరే పన్నును వసూలు చేసేదే ఈ టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్). దీనివల్ల పన్ను చెల్లింపుదారుల ఆదాయం ముందుగానే ప్రభుత్వానికి తెలిసిపోతుంది. పన్ను పరిధిలోకి మరింత మందిని తీసుకువచ్చేందుకు కూడా టీడీఎస్‌ను ఒక వ్యూహత్మక అస్త్రంగా కేంద్రం ప్రయోగిస్తున్నది. ఇప్పటికే కొన్ని రకాల బిజినెస్ పెర్క్స్.. ఐటీ చట్టం సెక్షన్ 28(4) కింద పన్ను పరిధిలోకి వస్తున్నాయి. ఇకపై కంపెనీలు తమ ఏజెంట్లకు ఇచ్చే బిజినెస్ రాయితీలన్నీ టీడీఎస్ పరిధిలోకే వస్తాయి. ఇలాంటి వాటిలో వాల్యూమ్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, స్పాన్సర్డ్ టూర్స్, డిస్ట్రిబ్యూటర్ల ప్రమోషనల్ స్కీమ్స్, అద్దె లేని ఇల్లు, ఫ్యామిలీ ట్రావెల్‌కు అరేంజ్మెంట్స్ వంటివి ఉన్నాయి. కంపెనీలు, తమ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్, డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే గిఫ్ట్ కార్డ్, మీల్ కార్డులు, మర్చంట్ షేర్‌హోల్డింగ్ ప్రోగ్రామ్, కొత్త సెల్లర్స్ రిఫరల్ ఫీ, కొంత నగదు కొంత లావాదేవీల రూపంలో ఇచ్చే అన్నింటికి కూడా టీడీఎస్ వర్తించనున్నది. ఈ బడ్జెట్ కొత్తగా మరో ప్రతిపాదన కూడా చేసింది. వ్యక్తులే అయినా రూ.20 వేలకు మించి ఒక వ్యాపారం నుంచి ఆదాయాన్ని పొందుతున్నైట్టెతే, ఆ ఆదాయాన్ని ఇచ్చే సంస్థే 10 శాతం ఆదాయం పన్ను (ఐటీ)ను మినహాయించుకుని సదరు వ్యక్తులకు చెల్లింపులు జరపాలి. దీంతో సగటు వ్యాపారుల ఆదాయానికి గండి పడనున్నది. ఈ కొత్త నిబంధన ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది.