తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక జరిగే దోషాల నివృత్తికి ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మొదటిరోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు.
సాయంత్రం బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో దుర్గరాజు, ఆలయ ప్రధాన అర్చకులు ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ రమేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.