హనుమకొండ, జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకాన్ని రాష్ట్ర రాజధాని బయటా అమలు చేస్తున్నది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో హనుమకొండ బస్‌స్టాండ్‌కు సమీపంలోని రెండు ఎకరాల 27 గుంటల విలువైన భూమిని గుంప గుత్తగా అధికార పార్టీ ప్రజాప్రతినిధి బంధువులకు కట్టబెట్టేందుకు ఏర్పాట్లుచేసింది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది. తాజాగా రెండు ఎకరాలను కమర్షియల్ ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు సిద్ధం చేసింది. ఈ ఒక్క భూమినే విక్రయిస్తే విమర్శలు వస్తాయనే కారణంతో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గతంలో చేసిన మరో మూడు వెంచర్లతోని ఖాళీ ప్లాట్లను వేలం వేస్తున్నారు.
వరంగల్ అజాంజాహి మిల్లు భూముల్లోని ఓసిటీ, ఉనికిచర్లలోని యూనిసిటీ, అంబేద్కర్ భవన్ పక్కన ఉన్న అపార్ట్మెంట్లోని ప్లాట్లను వేలంలో విక్రయించనున్నట్టు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటించింది. హనుమకొండ బస్‌స్టాండ్ సమీపంలోని విలువైన భూముల విక్రయాన్ని అడ్డుకుంటామని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో వేలం ప్రక్రియను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21న 8 కమర్షియల్ ప్లాట్లు, అంబేద్కర్ భవన్ పక్కన ఉన్న అపార్ట్మెంట్లోని 3 ప్లాట్లు, 25న ఓసిటీలోని 45 రెసిడెన్షియల్ ప్లాట్లు, 5 కమర్షియల్ ప్లాట్లు, 28న ఉనికిచర్లలోని యునిసిటీలో 40 రెసిడెన్షియల్ ప్లాట్లకు వేలం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ నగరంలోని భూ ములు రెవెన్యూ శాఖ నుంచి మున్సిపల్ శాఖకు బదిలీ అయ్యాయి. వరంగల్ మున్సిపాలిటీ వీటిని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి బదలాయించింది. హనుమకొండ బస్‌స్టాండ్ సమీపంలోని 2.27 ఎకరాల్లో కాళోజీ కళా క్షేత్ర నిర్మాణం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రధాన రోడ్డు లేకపోవడంతో ఈ భవన నిర్మాణాన్ని మరో స్థలానికి మార్చింది. అప్పటి నుంచి ఈ భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం పరిరక్షించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విలువైన భూములను 8 కమర్షియల్ ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నది.