Hero Darshan | హత్య కేసులో అరెస్టయిన ప్రముఖ కన్నడ హీరో దర్శన్ పరిస్థితి దారుణంగా మారినట్లు తెలుస్తోంది. తన ప్రియురాలు పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కోపంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడన్న ఆరోపణలపై దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక దర్శన్‌తో సహా 13 మంది నిందితులు అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అయితే ఈ జైలులో దర్శన్ పరిస్థితి దారుణంగా మారింది. దర్శన్ జైల్లో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడంటా.. అన్నం కూడా తినకుండా జైలు సిబ్బందిని ఒక్క సిగరెట్ ఇవ్వండంటూ వేడుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అసలు ఏం జరిగిందంటే.. చనిపోయిన రేణుకాస్వామి దర్శన్ వీరాభిమాని. అయితే దర్శన్ నటి పవిత్రా గౌడతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు వస్తున్న ఆరోపణలతో తమ హీరో పేరుప్రతిష్టలు దెబ్బతింటున్నాయని అతడు భావించేవాడు. దీంతో ఒక నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను సృష్టించి పవిత్రకు అసభ్యకరమైన మెస్సేజ్‌లు పంపి వేధించేవాడు. దీంతో పవిత్ర ఈ విషయాన్ని దర్శన్‌కు చెప్పింది.
తన ప్రియురాలిని వేధిస్తున్న రేణుకా స్వామిపై ఆగ్రహించిన దర్శన్ తన ఫ్యాన్స్ క్లబ్‌కు చెందిన రాఘవేంద్ర, కార్తీక్, కేశవమూర్తిని సంప్రదించాడు. తమ అభిమాన హీరోనే తమ వద్దకు వచ్చి సాయం అడగటంతో వారు కూడా దానికి ఆనందంగా ఒప్పుకున్నారు. దీంతో సుపారీ కింద దర్శన్ తొలుత వారికి రూ.5 లక్షలు ఇచ్చాడు. తన పేరు బయటకు రాకూడదని, వారు అరెస్టయితే అవసరమైన లీగల్ ఖర్చులు కూడా భరిస్తానని చెప్పాడు. దీంతో ఈ నెల 8న రేణుకాస్వామిని అతని ఇంటి సమీపంలో అడ్డగించిన దర్శన్ అభిమానులు అతడిని కామాక్షి పాల్యలోని ఒక షెడ్లోకి తీసుకెళ్లారు.
అక్కడికి వచ్చిన దర్శన్ బెల్టుతో స్వామిని చితకబాదాడు. తర్వాత దర్శన్ అభిమానులు కూడా అతడిని విపరీతంగా కొట్టడంతో స్వామి మరణించాడు. దీంతో ఈ విషయాన్ని నిందితులు దర్శన్‌కు తెలియజేసి , పరిస్థితిని చక్కదిద్డడానికి మరో రూ.25 లక్షలు తీసుకున్నారు. రేణకా స్వామి మృతదేహాన్ని ఒక మురుగు కాల్వలో పడేశారు. ఇక ఈ దారుణంపై కన్నడ నాట పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దర్శన్‌కు వ్యతిరేకంగా వందలాది మంది రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేశారు.