హనుమకొండ చౌరస్తా, జనవరి 9 : గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ర్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ 2025 రెండవ ఎడిషన్ టార్చ్ ర్యాలీ ముగిసింది. రెండు రోజులుగా హనుమకొండ జిల్లాలోని 13 మండలాలలో టార్చ్ ర్యాలీ నిర్వహించినట్లు హనుమకొండ జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్‌కుమార్ తెలిపారు. గురువారం 8 మండలంలో నిర్వహించగా, శుక్రవారం మిగతా ఐదు మండలాల్లో ర్యాలీ నిర్వహించినట్లు, ప్రతి గ్రామంలో స్థానిక ఎంపీడీవో, తహసిల్దార్, ఎంఈఓ, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు, సీనియర్ క్రీడాకారులు టార్చ్ రాలీకి స్వాగతం పలికారన్నారు.
ఎక్కడ చూసినా క్రీడా పండుగ వాతావరణంగా మారింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో టార్చ్ ర్యాలీ ప్రారంభం కాగా, గూడూరు, లక్ష్మీపూర్, శనిగరం, నడికూడ, పరకాల, కామారెడ్డి పల్లి, శాయంపేట, ఆరేపల్లి, తిరుమలగిరి ఆత్మకూరు, గూడెప్పాడ్, ఊరుగొండ, ఒగ్లాపూర్, దామెర, ఆరేపల్లి ములుగు రోడ్డు మీదుగా టార్చ్ ర్యాలీ తిరిగి హనుమకొండలోని జేఎన్‌ఎస్‌కు చేరుకుంది. ముఖ్యంగా నడికుడ మండలంలో అదనపు కలెక్టర్ రవి టార్చ్ ర్యాలీకి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.
క్రీడల్లో పాల్గొనడం వల్ల మంచి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని తెలిపారు. ప్రస్తుత సమాజంలో మొబైల్‌కు అలవాటుపడి చాలామంది వ్యసనాలకు పాల్పడుతున్నారన్నారు. రెండు రోజులుగా ముందుండి స్వయంగా టార్చ్ ర్యాలీని నడిపిస్తున్న హనుమకొండ జిల్లా యువజన క్రీడా అధికారి గుగులోత అశోక్‌కుమార్‌ను అభినందించారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాలు జరిగిన ర్యాలీలో సుమారు 5 వేల మంది క్రీడాకారులతోపాటు, ఎంపీడీవోలు, ఎంఈఓలు, సర్పంచులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, కోచ్ లు, పీఈటీలు, పీడీలు, క్రీడా సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.