తిరుమల : తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి చాతుర్మాస దీక్ష సంకల్పం(Chaturmasa initiation) అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీ వైష్ణవ సంప్రదాయకర్త రామానుజాచార్యుల పారంపర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైంది. పెద్దజీయర్ స్వామి మఠంలో కలశ స్థాపన, కలశ పూజ, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సేకరించిన పుట్ట మన్నుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చాతుర్మాస సంకల్పం స్వీకరించారు.
అనంతరం పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయ్యంగారి మఠం వద్ద నుంచి చిన్నజీయంగారు, ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామివారి బాలాలయాన్ని సందర్శించారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.
శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఇతర ఆలయ అధికారులతో కలిసి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత పెద్దజీయంగారికి మేల్చాట్ వస్త్రాన్ని, చిన్నజీయంగారికి నూలుచాట్ వస్త్రాన్ని బహూకరించారు.