Companies Closed | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశవ్యాప్తంగా 17వేలకుపైగా కంపెనీలు మూతబడ్డాయి. మంగళవారం రాజ్యసభలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం.. గత ఏడాది ఏప్రిల్ మొదలు ఈ ఏడాది జనవరి 26 వరకు మొత్తం 17,654 సంస్థలు షట్డౌన్ అయ్యా యి. అయితే వీటిలో ఇతర సంస్థల్లో విలీనమైనవి, బడా సంస్థలకు అమ్ముడైనవి, నష్టాలతో చేతులెత్తేసినవి, ఆర్థిక సమస్యలతో మూతబడినవి అన్నీ ఉన్నాయని మంత్రి వివరించారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2023-24) 22,044, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23) 84,801 కంపెనీలు బంద్ అయినట్టు తెలుస్తున్నది.
మరోవైపు గడిచిన దాదాపు 10 నెలల్లో దేశంలో కంపెనీల చట్టం కింద కొత్తగా 1,38,027 కంపెనీలు నమోదైనట్టు కూడా మంత్రి తెలిపారు. అలాగే 2023-24లో 1,85,318 కంపెనీలు, 2022-23లో 1,59,302 కంపెనీలు నమోదయ్యాయి. ఇకపోతే గత ఐదేండ్లలో దేశంలో 339 విదేశీ కంపెనీలు ఏర్పాటయ్యాయని మల్హోత్రా వెల్లడించారు. ఈ ఏడాదిలో ఏపీ, ఢిల్లీ, కేరళల్లో ఒక్కోటి.. తమిళనాడులో రెండు వచ్చాయన్నారు. నిజానికి 2020 నుంచి భారత్లో విదేశీ సంస్థల నమోదు క్రమేణా తగ్గుతున్నట్టు చెప్పారు.
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం (ఎస్ఎఫ్ఐవో) 82 దర్యాప్తు నివేదికల్ని సమర్పించినట్టు మంత్రి మల్హోత్రా తెలిపారు. కేవలం గత ఆర్థిక సంవత్సరంలోనే 2023-24 గరిష్ఠంగా 40 రిపోర్టులు వచ్చాయని వివరించారు. అయినప్పటికీ నయాపైసా రికవరీ లేదని స్పష్టం చేశారు. ఇక ఈ మూడేండ్లలోనే ఎస్ఎఫ్ఐవోకు మరో 26 కేసులను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అప్పగించినట్టు చెప్పారు. గడిచిన ఐదేండ్లలోనైతే ఈ సంఖ్య 72గా ఉందన్నారు.
గత ఏడాది మార్చి ఆఖరుకల్లా 2,664 మంది ప్రత్యేక రుణగ్రహీతలను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులుగా వర్గీకరించినట్టు ఓ లిఖితపూర్వక సమాధానంలో రాజ్యసభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. వీరిలో వ్యక్తిగత, విదేశీ రుణగ్రహీతలెవరూ లేరని స్పష్టం చేశారు. రుణాలను ఎగ్గొడుతున్నవారిపై కఠిన చర్యలను తీసుకొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి కేంద్రం పనిచేస్తున్నట్టు వివరించారు.