సిటీబ్యూరో, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్‌లో సినీనటి షాలు చౌరాసియాపై దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కెళ్లిన దుండగుడు ఎట్టకేలకు దొరికాడు. అతడు సినీ కార్మికుడిగా గుర్తించారు. బషీర్‌బాగ్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ నెల 14న రాత్రి కేబీఆర్ పార్కులోని వాక్‌వేలో వాకింగ్ చేస్తున్న సినీనటి షాలు చౌరాసియాపై అంధకారం ఉన్న ప్రాంతంలో దుండగుడు దాడి చేశాడు. మొబైల్ ఫోన్‌ను తీసుకొని పారిపోయాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు కోసం ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 30 మంది టాస్క్‌ఫోర్స్ పోలీసులను రంగంలోకి దింపి.. హ్యూమన్ ఇంటలిజెన్స్, సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు 70 నుంచి 80 మంది పాత నేరస్తులను విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు. ఘటనకు పాల్పడింది బంజారాహిల్స్ ఇందిరానగర్‌లో నివాసముంటున్న కొమ్ము బాబుగా గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు.
మూడేండ్ల కిందట నగరానికి…
మహబూబ్‌నగర్ జిల్లా కుల్కచెర్లకు చెందిన కొమ్ము బాబు చిన్నప్పటి నుంచి వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. మూడేండ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో నివాసముంటున్నాడు. సినిమా షూటింగ్‌లకు సెట్ వర్క్ హెల్పర్‌గా రోజుకు రూ. 500 కూలీకి పనిచేస్తున్నాడు. ఈ పని కూడా కేవలం 10 రోజుల పాటు ఉంటుండటంతో జీవనం కష్టంగా మారింది. దీంతో స్నాచింగ్‌లకు పాల్పడాలని నిర్ణయించుకుని.. కేబీఆర్ పార్క్ ఔటర్ వాకింగ్ ట్రాక్‌ను ఎంచుకున్నాడు. అంధకారం ఉన్న చోట యువతులు, మహిళలను టార్గెట్ చేసుకొని.. స్నాచింగ్‌లకు తెగబడ్డాడు. ఈ నేపథ్యంలోనే 2019 డిసెంబర్లో గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకరి నుంచి సెల్‌ఫోన్ లాగేందుకు ప్రయత్నించి.. దాడికి పాల్పడగా, పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ ఏడాది జనవరిలో ఒకరి వద్ద మొబైల్ ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినా.. కొమ్ము బాబు మాత్రం దొరకలేదు. తాజాగా నటిపై దాడి కేసులో పట్టుబడ్డాడు.
స్నాచర్ల డేటా సేకరించి..
దర్యాప్తులో భాగంగా పోలీసులు మూడేండ్లుగా జరిగిన స్నాచింగ్ కేసుల చిట్టాను తెప్పించుకున్నారు. ఎంత మంది జైలులో.. ఎంత మంది బయట ఉన్నారు. ఈ వారం రోజుల్లో వారి కదలికలపై సమాచారం సేకరించారు. అలా గోల్కొండ పీఎస్‌లో జరిగిన కొమ్ము బాబు కేసు బయటపడింది.
వాట్సాప్‌లో ఫొటో షేర్..
కొమ్ము బాబును అదుపులోకి తీసుకున్న తర్వాత అతడి ఫొటోను బాధితురాలు చౌరాసియాకు పంపారు. ఆమె 90 శాతం పోలికలను గుర్తించడంతో బాబును అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా, నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడు ఖరీదైన ఫోన్లు ఎత్తుకెళ్లి.. అమ్ముకొని సొమ్ము చేసుకోవడమే వృత్తిగా పెట్టుకున్నాడని తెలిసింది. కాగా, ఈనెల 2న కూడా కేబీఆర్ పార్కు వద్దే ఓ మహిళ నుంచి ఫోన్ చోరీ చేయాలని బాబు ప్రయత్నించగా ఆమె అతడి చెయ్యి కొరికి పారిపోయింది. ఈ క్రమంలో 14న చౌరాసియా పై దాడి చేసి.. ఫోన్ లాక్కెళ్లాడు. ఆ మరుసటి రోజు కూడా సినిమా సెట్టింగ్ పనులకు వెళ్లాడని దర్యాప్తులో తేలింది.
సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆలస్యం
సంఘటన జరిగిన చోట సీసీ కెమెరాలు లేవు. అందుకే దర్యాప్తు ఆలస్యమైంది. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాం. టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ టీమ్ కేసును ఛేదించారు. సీసీ కెమెరాలు, టెక్నాలజీ ద్యారా దర్యాప్తు వేగంగా జరుగుతుంది. నేనుసైతం, కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటులో మనం మొదటి స్థానంలో ఉన్నాం. కాని అది సరిపోదు. కొన్ని హాట్‌స్పాట్ ఏరియాల్లో ఏర్పాటు చేయాలి. అందుకు ప్రజలు మరింత భాగస్వాములు కావాలి.