Krishna | తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం గుర్తు పెట్టుకునే గొప్ప నటుల్లో దివంగత లెజండరీ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ ఒకరు. సంచలనాలకు మారుపేరుగా నిలిచిన కృష్ణ చేయని ప్రయోగం లేదు. చూడని సక్సెస్ కాలేదు. అందుకే ఆయన సాహసాల కృష్ణ అని కూడా పిలుచుకుంటారు ఆయన అభిమానులు. నటనలో తనకంటూ ఓ పత్యేక ట్రేడ్ మార్క్‌ను సొంతం చేసుకున్న ఈబుర్రి పాలెం బుల్లోడు, తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోగా ప్రవేశించడానికి ఇన్ని సంచలనాలు సృష్టించడానికి, తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ లాంటి గొప్ప నటుడు సంపాందించుకోవడానికి ఓ సంఘటనే ప్రధాన కారణం. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణగారే ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
మా స్వస్థలం తెనాలి తాలుకా బుర్రిపాలెం. వ్యయసాయం చేసుకుంటూ జీవనం గడిపే కుటుంబం మాది. నాకు ఊహ తెలిసి నేను చూసిన తొలిచిత్రం ‘పాతాళ భైరవి’. మా తెనాలిలోని రత్నా టాకీస్‌లో ఆ సినిమా చూశాను. ఆ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఎంతో ముగ్థుడయ్యాను. ఇక అప్పటి నుంచి నా అభిమాన హీరో ఎన్టీఆర్ అని మనసులో నాటుకపోయింది. కానీ నేను సినిమాల్లో కాకుండా బయట నా కళ్లతో చూసిన మొదటి హీరో మాత్రం అక్కినేని నాగేశ్వరరావు. ఎంతో స్టయిల్‌గా సూటు బూటుతో చేతులూపుతున్న ఆయన్ని చూశాను. ఇక ఆయన వెనకాలే నవ్వుతూ అందంగా ఉన్న సావిత్రి. ‘తోడి కోడళ్లు’ వంద రోజుల వేడుకలో చూశాను.
ఆ తరువాత మళ్లీ ఏలూరులో ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో అక్కినేని నాగేశ్వరరావును చూశాను. అప్పటికే అరవై సినిమాలకు పైగా పూర్తి చేసుకున్న నాగేశ్వరరావుని ఆ కాలేజీ వాళ్లు ఘనంగా సన్మానించారు. అక్కడి విద్యార్థులు ఎంత గోల చేశారో, చప్పట్లు, ఈలలు.. అబ్బ ఎంత అభిమానం, ఎవరికైనా ఇలాంటి వైభోగం దక్కుతుందా అనిపించింది. అప్పుడే ఇక నేను కూడా హీరో కావాలని నిర్ణయించుకున్నాను. ఇంజనీరింగ్‌లో సీటు సంపాందించుకోలేకపోయాను. నాకు కూడా ఇంజనీరింగ్ చేయడం ఇష్టం లేదు. ఇక ఆ సినిమా ఊహల మధ్యే డిగ్రీ పూర్తిచేశాను. కానీ నా మనసంతా సినిమాల చుట్టే తిరుగుతుండేది. నా మనసులోని మాటను నాన్నకు చెప్పాను. ఆయన నీ ఇష్టం అనడంతో చెన్నయ్ రైలెక్కాను ” అంటూ సూపర్ స్టార్ కృష్ణ చెప్పుకొచ్చారు