ఆఫ్రికా దేశాలంటే ప్రపంచంలోని చాలామంది ప్రజలకు అవి వెనుకబడిన దేశాలనే అపోహ ఉన్నది. వారికే కాదు, నాక్కూడా ఆయా దేశాల్లో పర్యటించే వరకు ఆఫ్రికా దేశాలు అభివృద్ధిలో వెనుకంజలో ఉన్నాయనే దురభిప్రాయం ఉండేది. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రపంచ పర్యావరణ సంస్థ శాస్త్రవేత్త బిక్షంలతో కలిసి నేను ఇటీవల, మార్చి 10 నుంచి 22వ తేదీ వరకు ఆఫ్రికాలోని ఉగాండా, కెన్యా, టాంజానియా దేశాల్లో 12 రోజుల పాటు పర్యటించాను. ఈ పర్యటనలో భాగంగా అక్కడ మేము పరిశీలించిన విషయాల సంక్షిప్త సమాచారమే ఈ వ్యాసం.
ఆఫ్రికా దేశాల్లో వెనుకబడిన ప్రాంతాలు, విపరీతమైన ఎండలు, ఆహార కొరత, దొంగతనాలు, దోపిడీలు, అపరిశుభ్రత కారణం గా విపరీతమైన రోగాలు వ్యాపిస్తాయనే అపోహ ఉండేది. అందుకే, మేము ఆ రోగాల బారిన పడకూడదనే భయంతో ఆఫ్రికా దేశాలకు వెళ్లేముం దు ఎల్లో కవర్ వ్యాక్సినేషన్ కూడా చేసుకొని వెళ్లాము. కానీ, అక్కడి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆఫ్రికా దేశాల గురించి మేము విన్నవన్నీ అసత్యాలనిపించింది. నిజంగా అక్కడి ప్రజలు కష్టపడి పనిచేసే శ్రమజీవులు. ఆఫ్రికా దేశాల్లో సారవంతమైన భూములున్నాయి. అంతేకాదు, విశాలమైన పచ్చిక బయళ్లు, మంచి వాతావరణం కలగలిసి బ్రహ్మాండమైన పంటలు అక్కడి ప్రజలు పండిస్తున్నారు. గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలను సందర్శించాం. అక్కడి డెవలప్మెంట్ అథారిటీలనూ కలిసి వివరాలు తీసుకున్నాం.
ఆఫ్రికా దేశాలు అభివృద్ధి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు. అక్కడి ప్రజలు గుండెల నిండా ప్రేమ కలిగి ఉన్నారు. చిన్న నేరాలు కూడా జరగని ప్రాంతాలున్నాయంటే అతిశయోక్తి కాదు. అక్కడి వాతావరణం ప్రశాంత జీవనానికి అనుకూలంగా ఉన్నది. కెన్యా, నైరోబీ, ఉగాండా లాంటి ప్రాం తాల్లోనైతే ఫ్యాన్లు, ఏసీల అవసరమే రాలేదు. ఏడాదిలో 4 నెలలు వర్షాలు. 2 నెలలు కాస్త ఎండలు. మళ్లీ 4 నెలలు వర్షాలు, ఆ తర్వాత 2 నెలలు మళ్లీ మామూలు ఎండలు. అంటే ఏడాదిలో 8 నెలలు వర్షాలుంటే, 4 నెలలు మాత్రమే కాస్త పొడి ఎండలుంటాయి. బావులు, బోర్లు, చెక్ డ్యాములు, ప్రాజెక్టులు, కాల్వలు మాకెక్క డా కనిపించలేదు. సహజ సిద్ధమైన వర్షాలతోనే వ్యవసాయం సాగుతున్నది. ఎగుడు దిగుడు మట్టిదిబ్బలు, పచ్చని పచ్చిక బయళ్లు, అందమైన లాండ్ స్కేపింగ్, ఎక్కువ శాతంగా అటవీ ప్రాంతం, జీవ జంతుజాలాన్ని మేం చూశాం.
ఆఫ్రికా దేశాల ప్రజలకు ప్రకృతి అంటే మక్కువ. అభివృద్ధి చేయకున్నా మంచిదే గానీ, వనరులను, ప్రకృతిని విధ్వంసం చేయవద్దని వాళ్లు కోరుకుంటారు. ఇదంతా చూసిన తర్వాత ఈ ఆఫ్రికా దేశాల పట్ల ఎందుకంత దురభిప్రాయం ఏర్పడిందోనని నాలో నేను చాలా బాధపడ్డాను. వారిపై జరిగిన దుష్ప్రచారాలను ఇన్నిరోజులు ఎందుకు నమ్మామా అని మధనపడ్డాను.
విచిత్రమేమంటే అక్కడి ప్రభుత్వాలు ప్రజలకేవీ ఉచితంగా ఇవ్వవు. రక్షణ, కోర్టులు తదితర వ్యవస్థలు మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి. కొంతమేరకు విద్య, వైద్యం తప్ప ప్రభుత్వం నుంచి ఇతరత్రా ఆశించేదేమీ ఉండ దు. ఆఫ్రికా దేశాల్లో మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కుటుంబ పెద్ద మహిళనే. ప్రతి మహిళ తన శక్తిమేరకు వివిధ కంపెనీలలో, డిపార్టుమెంట్లలో పనిచేస్తుంది. మహిళలు పనిచేయని రంగం అంటూ లేనే లేదు. ప్రతి రంగంలో మహిళలదే పైచేయి. పిల్లలకు చదువు సంధ్యలు నేర్పించి, వారిని పెంచి పెద్దచేసే బాధ్యత కూడా మహిళలే తీసుకుంటారు. అలాగని, అక్కడ పురుషులను చిన్నచూపు చూడరు.
తరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టాలనే అత్యాశ ఆఫ్రికా దేశ ప్రజలకులేదు. ఎవరి కష్టం వాళ్లది. ఎవరి కష్టఫలాన్ని వారే అనుభవిస్తారు. ఈ గొప్ప సారాంశం అక్కడి ప్రజల జీవనశైలిలో మాకు కనిపించింది. ఇతరుల సొమ్మును ఆఫ్రికా దేశస్థులు ఆశించడం లేదు. అంతెందుకు మా 12 రోజుల పర్యటనలో చేయి చాపి అడుక్కునే వారు ఒక్కరూ కనిపించలేదు. ప్రజలకు ఏదీ ఉచితంగా అందించకపోయినా అక్కడి ప్రజల్లో ప్రభుత్వాలపై వ్యతిరేకత లేదు.
అసలు రాజకీయాలను వారు పట్టించుకోరు. అక్కడి ప్రజలకు ప్రకృతి అంటే మక్కువ. అభివృద్ధి చేయకున్నా మంచిదే గానీ, వనరులను, ప్రకృతిని విధ్వంసం చేయవద్దని ప్రజలు కోరుకుంటారు. ఇదంతా చూసిన తర్వాత ఈ ఆఫ్రికా దేశాల పట్ల ఎందుకంత దురభిప్రాయం ఏర్పడిందోనని నాలో నేను చాలా బాధపడ్డాను. వారిపై జరిగిన దుష్ప్రచారాలను ఇన్నిరోజులు ఎందుకు నమ్మామా అని మధనపడ్డాను. అక్కడి భూములు గ్రామ కమ్యూనిటీ ఆధీనంలోనే ఉంటాయి. ప్రజలకు భూములు కావాలంటే కమ్యూనిటీలే ఇస్తాయి. భూములిస్తే తీసుకోవడం, వ్యవసాయం చేసుకోవడమే తప్ప, ఇది నా భూమి, ఇదిగో నా భూమి పట్టా, నా భూమి, నా ఇష్టం అనే వాతావరణం లేదు. ఒక్కో కుటుంబం కట్టుకునే ఇల్లు వెయ్యి గజాలపైనే ఉంటుంది. ప్రతి ఇంట్లో ఆలుగడ్డ, టమాటాలతో తయారుచేసుకొని తినే ఉగ్గానీ ఆహారం గానీ, ఆహారంగా తినే కవాసా చెట్ల గడ్డలు గానీ, ఇతర కూరగాయలు గానీ, పండ్లు గానీ ఉంటాయి. దైనందిన జీవితంలో వారికేం కావాలో వాటన్నింటినీ వారే పండించుకుంటారు, ఇతరులపై ఆధారపడటం లేదు. సారవంతమైన ఎర్ర నేలలు, నల్ల నేలలు. ట్రాక్టర్లుండవు, ఎడ్లుండవు. మరేం చేస్తారో తెలుసా? విత్తులు నాటుతారు, ఆ విత్తులే పంటై పండుతుంది. వారు పండించిన ఆహారాన్నే తింటారు తప్ప, బయటి ఫుడ్‌ను ఇష్టపడరు. ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అసలు వాడరు. ఇంటిఖర్చుల కోసం ఆవులను పెంచి, వాటి పాలను అమ్ముకుంటారు. 70 ఏండ్లు వచ్చిన వృద్ధులు కూడా పనిచేస్తూనే ఉన్నారు.
అక్కడి ప్రజలు వారంలో 5 రోజులు పనిచేస్తే, మిగతా 2 రోజులు స్వేచ్ఛగా తమ కష్టఫలాన్ని అనుభవిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆఫ్రికా దేశాల రోడ్లపై సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా ఉండదు. పోలీసులు కూడా పెద్దగా కనిపించరు. అయినప్పటికీ ప్రజలు మాత్రం రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారు. కారు వెనుక కారు వెళ్తుందే తప్ప దాటిపోవడాలు మాకు ఎక్కడా కనిపించలేదు. ప్రజలు క్రమశిక్షణతో, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారు. ఎంత గొప్ప సమాజం అది. కష్టపడి జీవించడంలో వారికి వారే సాటి. ‘మీ ప్రభుత్వం మీకు ఏమీ ఉచితంగా ఇవ్వదా?’ అని మేం అడిగితే… ‘ప్రభుత్వం మాకు ఎందుకు ఇవ్వాలి?’ అని వారే మమ్మల్ని ఎదురు ప్రశ్నించారు. ‘ప్రభుత్వానికి మేం పెద్దగా కట్టేదేమీ ఉండదు, ప్రభుత్వం కూడా మాకేమీ ఇవ్వదు’ అనే గొప్ప సమాధానం ఇచ్చారు. ‘మూడు, నాలుగు దశాబ్దాలుగా ఒకరే అధ్యక్షులుగా ఉన్నారెందుకు’ అని ప్రశ్నిస్తే… ‘ఎవరుంటే మాకెందుకు? వారెవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, ఇబ్బంది పెట్టరు, మాపై అనసవరమైన పన్నులు వేయరు. మా కష్టం మేం పడుతం, మా సంపాదన మేం తింటాం, మా జీవితాలు సంతృప్తికరంగానే ఉన్నాయి’ అని సంతోషంగా చెప్పారు.
మనం ఆఫ్రికా దేశాల ప్రజల నుంచి నేర్చుకోవాల్సినది ఏమన్న ఉన్నదా అంటే చాలానే ఉన్నదని చెప్పుకోవాలి. వారు తమ ఇండ్లలో పాటించే పరిశుభ్రతను మనం కూడా పాటించాలి. బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన అసలే ఉండదు. ఇది కూడా మనం నేర్చుకోవాల్సిందే. ఆఫ్రికా దేశాల్లో జాతీయ పార్కులు ఎన్నో ఉన్నాయి. మేం చాలా పార్కులే తిరిగాం. ఒక స్వీడిష్ దేశస్థుడు ఉగాండాలో ఒక దీవిని లీజుకు తీసుకొని ప్రభుత్వ అనుమతితో సింహాలు, చిరుతపులులు, ఏనుగులు తదితర జంతువులతో జూ పార్కును నిర్వహిస్తున్నాడు. అక్కడ సింహాలకు అలవాటుపడిన వ్యక్తుల రక్షణలో మేం వాటిని ముట్టుకొని మంచి అనుభూతిని పొందాం. ఇలాంటి అనుభూతులు ఇంకెన్నో ఉన్నాయి.
ఆఫ్రికా దేశాల ప్రజల్లో.. స్వతంత్ర భావాలు కలిగి ఉండటం, స్వేచ్ఛగా జీవించడం, ప్రభుత్వాలపై ఆధార పడకుండా జీవించడం, దేశం పట్ల ఎక్కువ ప్రేమాభిమానాలు కలిగి ఉండటం వంటివి మాకు చాలా నచ్చాయి. కష్టపడి పనిచేయడం తప్పితే, రాబోయే తరాలకు ఆస్తులు సంపాదించిపెట్టాలనే అత్యాశ అక్కడి ప్రజల్లో మాకు కనిపించలేదు. మన దేశంలోని మధ్యతరగతి ప్రజలు ఆఫ్రికా దేశాల ప్రజల జీవన స్థితిగతులను గనుక పరిశీలిస్తే… వారు తమ జీవనశైలిని, అలవాట్లను, అభిప్రాయాలను తప్పక మార్చుకుంటారు. అందుకే మనం అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాలను సందర్శించే బదులుగా.. అభివృద్ధి చెందుతున్న, మన జీవనశైలికి దగ్గరగా ఉన్న ఆఫ్రికా దేశాలను సందర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నా. దీంతో అక్కడి ప్రజల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మొత్తంగా చెప్పేదేమంటే… ఇంకో పదేండ్లలో ఈ ఆఫ్రికా దేశాలు మరింతగా అభివృద్ధి చెందుతాయి. ప్రపంచంలోని మరెన్నో దేశాలకు మార్గదర్శకంగా ఉంటాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.