Board Exams | న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలకు మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ నిబంధనలను పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని, ఏమన్నా అభ్యంతరాలుంటే మార్చి 9 లోగా తమకు సమర్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులను సీబీఎస్ఈ కోరింది. ఈ కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం మొదటి విడత పరీక్షలు ఫిబ్రవరి- మార్చిలో, రెండో విడత పరీక్షలు మేలో జరుగుతాయి. విద్యార్థులు కావాలనుకుంటే ఈ రెండు పరీక్షలకు హాజరు కావొచ్చు.
మొదటి విడత రాసిన పరీక్షల్లోని కొన్ని సబ్జెక్టులలో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందితే ఆ సబ్జెక్టులకు రెండో విడత పరీక్షలను రాయకుండా మానేయవచ్చు. పూర్తి సిలబస్‌కే ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థికి రెండుసార్లూ ఒకే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బోర్డు మొదటి, రెండో విడత పరీక్షలు సప్లిమెంటరీ పరీక్షలుగా కూడా పనిచేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక పరీక్షలు నిర్వహించరు. అంటే ప్రత్యేకంగా సప్లిమెంటరీ పరీక్షల విధానం ఉండదు. నూతన విద్యా విధానంలో భాగంగా, విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ఏడాది రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహించనున్నారు. తమకు వచ్చిన స్పందనలు పరిశీలించిన తర్వాత ముసాయిదాను సమీక్షించి తుది నిబంధనలు ఖరారు చేయనున్నట్టు సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సన్యమ్ భరద్వాజ్ తెలిపారు.