తిరగబడిన భూ నిర్వాసితులు
మల్హర్, ఫిబ్రవరి 10 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల ఉపరితల బొగ్గుగని వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకున్నది. డేంజర్‌జోన్‌లో ఉన్న ఇండ్లను తీసుకోకుండా, బ్లాస్టింగ్లతో పొమ్మనలేక పొగబెడుతూ తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ భూ నిర్వాసితులు అధికారులపై తిరగబడ్డారు. తాడిచెర్ల ఓపెన్‌కాస్టు బొగ్గు గనిని చుట్టు ముట్టి.. బొగ్గు ఉత్పత్తిని స్తంభింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్లాస్టింగ్లతో ఇండ్లు పగులడమే కాకుండా విషవాయువులతో దినదిన గండంగా గడుపుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
ఓసీపీ నుంచి బొగ్గును ఎట్ల తీసుకెళ్తారో చూస్తామంటూ భీష్మించుకొని కూర్చున్నారు. మరి కొంతమంది గని పరిసర ప్రాం తాల్లో ధర్నా చేశారు. జెన్కో అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగేశ్వరరావు, కొయ్యూరు ఎస్సై నరేశ్, జెన్కో ఈఈ, తహసీల్దార్ అహ్మద్, ఏఈ వెంకటేశ్వరరావు గ్రామస్తులను సముదాయించినా వినకుండా ఆందోళనను కొనసాగించారు.