Actress Hema | బెంగళూరు, జూన్ 3: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తెలుగు నటి హేమ అరెస్ట్ అయ్యారు. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణకు వచ్చేటప్పుడు హేమ బురఖా ధరించి తన గుర్తింపును దాచి పెట్టడానికి ప్రయత్నించారు. విచారణలో ఆమె సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. గతంలో రెండుసార్లు నోటీసులు ఇవ్వగా హేమ విచారణకు హాజరు కాలేదు.
దీంతో తాజాగా మరోసారి నోటీసులిచ్చి విచారణ చేశాక ఆమెను అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీలో అసలు తాను పాల్గొనలేదని హేమ మొదట బుకాయించారు. అయితే ఆమె ప్రయాణించిన విమాన టికెట్లను పోలీసులు సాక్ష్యాలుగా చూపించడంతో విచారణ ఎదుర్కొనక తప్పలేదు. గత నెల 19న రేవ్‌పార్టీ జరిగిన స్థలంలో లభించిన డ్రగ్స్, పార్టీకి హాజరైనవారి రక్త నమూనాల పరీక్షల నివేదికల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రేవ్‌పార్టీలో మొత్తం 103 మంది పాల్గొనట్టు.. అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించారు. ఇందులో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నట్టు తేలింది.