Telegram : నీట్ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అయితే, కేంద్రం నిషేధం విధించినా.. ఇంకా ఈ యాప్ పని చేస్తుందని కొందరు టెక్ నిపుణులు అంటున్నారు. నిజానికి ఈ యాప్ నిషేధం పూర్తిగా సాధ్యం కాకపోవచ్చని వారు చెబుతున్నారు. జూన్ 21, ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. గతంలో పేపర్ లీకేజీని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి కొన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా టెలిగ్రామ్ యాప్‌ను కేంద్రం నిషేధించింది.
అలాగే, జూన్ 30 వరకు టెలిగ్రామ్ యాప్‌లో ఉన్న మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా ప్రభుత్వం డిసేబుల్ చేసింది. దీనివల్ల టెలిగ్రామ్ యాప్ ద్వారా పేపర్ లీకేజీ అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఒకపక్క కేంద్రం ఈ యాప్‌ను బ్లాక్ చేసినా ఇంకా ఈ యాప్ పని చేస్తున్నట్లు కొందరు టెక్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్లేస్టోర్ నుంచి టెలిగ్రామ్‌ను తొలగించగా, యాపిల్ స్టోర్ నుంచి కూడా తొలగిస్తారు. అయితే, ఇతర థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్, వెబ్, ఏపీకేల ద్వారా టెలిగ్రామ్‌ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అసలు టెలిగ్రామ్ యాప్ డిజైనింగే ఇలాంటి బ్యాన్స్కు దొరకకుండా ఉండేలా రూపొందింది అని టెక్ నిపుణుల అభిప్రాయం. మనదేశంలో ఐఎస్పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) లెవల్లో బ్లాకింగ్ చేసే వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు. ఇటీవల సీబీఎస్ఈ వెబ్‌సైట్‌లోని లోపాల్ని బయటపెట్టిన 19 ఏళ్ల నిసర్గ అధికారి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించాడు. దేశంలో టెలిగ్రామ్‌ను పూర్తిగా నిషేధించడం సాధ్యం కాకపోవచ్చన్నాడు. ప్రాక్సీలు, ఇతర పద్ధతుల ద్వారా వాడేందుకు అనుగుణంగా ఈ యాప్ తయారైందన్నాడు.
సాధారణంగా ఒక యాప్‌ను బ్లాక్ చేస్తే ఇంటర్నెట్ అందించే సంస్థలైన జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు వాటిని పూర్తిగా తొలగించాలి. ఆ ఇంటర్నెట్ ఉపయోగించి యూజర్లు వాటిని సెర్చ్ చేసినా అవి అందుబాటులో ఉండకూడదు. ఏదైనా ఒక సైట్ సెర్చ్ చేయగానే ఐఎస్పీలు.. డీఎన్ఎస్ (డొమైన్ నేమ్ సిస్టమ్)లోకి వెళ్లి వాటిని అందిస్తాయి. ఐఎస్పీలు వీటిని బ్లాక్ చేస్తే ఆ వెబ్ లేదా యాప్ సర్వర్లోకి కూడా కనెక్ట్ కాకూడదు. కానీ, టెలిగ్రామ్ మాత్రం డీఎన్ఎస్లలోకి దొరకుండా పని చేస్తుందని టెక్ నిపుణులు అంటున్నారు. ఇలాంటి లోపాలుండటం వల్ల టెలిగ్రామ్ పూర్తిగా నిషేధించడం సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.