హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. జైలు పరిపాలన చరిత్ర, శిక్ష పద్ధతులలో వచ్చిన మార్పులను భావితరాలకు వివరించేలా చంచల్గూడలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (శికా)లో ప్రతిష్టాత్మకమైన జైలు మ్యూజియాన్ని ఏర్పాటుచేసింది. భారతదేశంలో ఇప్పటివరకు అండమాన్ నికోబార్, అలీపూర్ (కోల్కతా), బెంగళూరు, గోవాలలో మాత్రమే జైలు మ్యూజియంలు ఉన్నాయి. ఇప్పుడు చంచల్గూడలో ప్రారంభమైన ఈ మ్యూజియం దేశంలోనే ఐదవదిగా రికార్డు సృష్టించింది.
గతంలో సంగారెడ్డిలో ఉన్న మ్యూజియం కుప్పకూలడంతో, ఆ వారసత్వాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో జైళ్ల శాఖ ఈ నూతన ప్రాజెక్టును చేపట్టింది. ‘ఫీల్ ది జైల్’ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ మంగళవారం ప్రారంభించనున్నారు. జైలులో ఖైదీలు ఎ లా ఉంటారు? ఏవేం పనులు చేస్తారు? ఎలాంటి భోజనం తింటారు? ఎలాంటి గదుల్లో నిద్రిస్తారు? అనే విషయాలు ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకునేందుకు పౌరుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.