హైదరాబాద్, నవంబర్ 8: దుబాయ్ ఎక్స్పో2020లో తెలంగాణ స్టార్టప్‌లు హల్చల్ చేయనున్నాయి. మంగళవారం నుంచి 12వ తేదీ వరకు భారతీయ పెవిలియన్ వద్ద ఈ సంస్థల కార్యకలాపాలను ప్రదర్శించనున్నారు. వీటిలో హెల్త్‌కేర్, ఎడ్టెక్, డ్రోన్స్, ప్రాప్‌టెక్, ఫిన్‌టెక్, అగ్రిటెక్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, అప్పారెల్ తదితర రంగాలకు చెందిన మొత్తం 14 సంస్థలుండగా, మహిళల సారథ్యంలో నడుస్తున్న ఐదు కంపెనీలూ ఉన్నాయి. నాలుగు రోజులపాటు ఇక్కడ నిర్వహించే వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో రాష్ట్రంలోని వ్యాపార, స్టార్టప్ ఎకోసిస్టమ్ సరికొత్త ఆలోచనలు, ఉత్పత్తులు, సేవల్ని ఆవిష్కరించనున్నారు. తద్వారా అంతర్జాతీయ మదుపరులకు తెలంగాణలో ఉన్న వ్యాపారావకాశాల్ని వివరించనున్నారు. ఇప్పటికే ఫిక్కీ అనుబంధ సమాఖ్య ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు కే భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో 17 మంది సభ్యుల వ్యాపార బృందం దుబాయ్‌కి చేరుకున్నది. తెలంగాణలో వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడానికి దుబాయ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతోపాటు ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్‌తోనూ ఎఫ్‌టీసీసీఐ బృందం సమావేశాల్ని నిర్వహించనున్నది.