-దాము నర్మాల
ఎన్నికలంటేనే కాంగ్రెస్‌కు చలిజ్వరమా?
‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు మాదే.. తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్‌కు తిరుగులేదు’ అంటూ మైకులు దద్దరిల్లేలా ఆ పార్టీ నేతలు ఉపన్యాసాలు ఇస్తుండ్రు. ఆ పరిస్థితి లేదు, అది వేరే సంగతి. కానీ అదేందో ఎన్నికల పేరు వినగానే హస్తం పార్టీ నాయకులు ఆమడ దూరం వెనక్కి ఉరుతున్నరు. దుప్పటి కప్పుకొని మూలకు జారుకుంటున్నట్టు కనిపిస్తుండ్రు. ఇప్పటికే స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసి రెండేండ్లు దాటిపోయింది. అయినా ఆ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశం కనిపిస్తలేదు. నిజంగానే గెలుపు అంత ఖాయమైతే మరి ఈ తడబాటు ఎందుకో జనాలకు అర్థం కావడంలేదు.ఖైరతాబాద్ ఉప ఎన్నిక విషయంలోనూ కాంగ్రెస్ నేతలు సైలెంట్ అయిపోయారు. ‘ఎన్నికలొచ్చినా మేం రెడీ’ అంటరు.. మరోవైపు ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టకుండా కోర్టు తలుపులు తడుతుండ్రు. కయ్యానికి కాలుదువ్వి, కొట్లాట మొదలయ్యేముందు కాళ్లు పట్టుకుంటున్నట్టు వ్యవహరిస్తున్నట్టున్నది ముచ్చట! ఇక ఎమ్మెల్సీ టికెట్ దగ్గర కూడా కొత్త ట్విస్ట్. సర్వోత్తమ్‌రెడ్డి పేరు ప్రకటించగానే పోటీకి ఆయన విముఖత అంటూ వార్తలు. అయినా టికెట్ ప్రకటించే ముందు అభ్యర్థికి చెప్పరా? ఎప్పుడైనా రెడీ అనగానే ఎన్నికల గంట మోగే సమయానికి ‘అయ్యా, గంట ఇప్పుడే కొట్టకండి’ అంటున్నరు. గెలుపు మీద అంత నమ్మకం ఉంటే ఎన్నికలంటే ఎందుకింత వణుకు? పరీక్షకు భయపడేది ప్రిపేర్ కాని విద్యార్థులే కదా!
అటు కుస్తీ డ్రామా.. ఇటు దోస్తీ!

ఇదేం రాజకీయం అయ్యా! అని బీజేపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నరు. మొన్నటికి మొన్న సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల పర్యటనకు ముందు ఒక డైలాగ్ కొట్టిండ్రు. బీజేపీ శ్రీరాముడి పార్టీ, శివుడిని పట్టించుకోదు అని ఏదేదో నోటికొచ్చింది మాట్లాడిండ్రు. దీనికి కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ హిందువులను నార్త్, సౌత్ అని రేవంత్ విడగొడుతున్నరు అని అన్నరు. కానీ, అసలు సంగతి రెండు రోజుల్లోనే తేలిపోయింది! సీఎం పర్యటన రోజున… బీజేపీ, ఏబీవీపీ నాయకులు ఏమైనా గొడవ చేస్తరేమో అని పోలీసులు అనుకున్నరు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేసిండ్రు. ఇక సొంత పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లలో ఉంటే, బండి సంజయ్ మాత్రం రేవంత్ పక్కన నిలబడి నవ్వుతూ, పరస్పరం అభినందనలు చెప్పుకుంటూ దోస్త్ మేరా దోస్త్ అనుకుంటూ జోష్‌గా కనిపించిండ్రు. ఇదంతా చూస్తున్న సామాన్యులతోపాటు బీజేపీ గల్లీ కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నరు. ఇద్దరు లీడర్ల ఇకఇకలు, పకపకలు చూస్తూ ఇదంతా అటు కుస్తీ డ్రామా.. ఇటు దోస్తీ! లెక్క కనబడుతున్నదని అంటున్నరు. ఇవేం డ్రామాలు? అని మండిపడుతున్నరు. ఇలాంటి లీడర్ల మాటలు నమ్మి రెచ్చిపోతూ, వాళ్ల దగ్గర పని చేయడం కర్మ! అని నిట్టూరుస్తున్నరు.
చార్జీల మోత.. జనం గుండెకోత!

ఒక్కసారే ఆటో చార్జీలు యాభై శాతానికి పైగా పెంచేసిండ్రు! సూటిగ సామాన్యుడి జేబుకు సూటి పెట్టిండ్రన్నమాట. ఇక బస్సుల సంగతి చూస్తే దట్ ఈజ్ మాయా బజార్! ’ ఫ్రీ బస్సు స్కీమ్‌తో ఆర్టీసీ బస్సులు లేడీస్‌తో కిటకిటలాడుతున్నయి. ఎలక్ట్రిక్ బస్సులేమో రోడ్డు మీద పోతుండగానే బ్రేక్ డౌన్ అయితున్నయ్, లేదంటే అగ్గి అంటుకుంటున్నాయి. ఇటు చూస్తే పండుగలు, జాతర్ల వేళ అదనపు వసూళ్లయితే పద్ధతేనాయె! మరి బస్సులు పెరిగినయా అంటే లేవు, సదుపాయాలు పెరిగినయా అంటే అదీ లేదు.ఇదంతా ఇప్పుడెందుకంటే.. 2023 ఎలక్షన్ల ముందర కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏంటియి? ప్రతి ఆటో డ్రైవరన్నకూ ఏడాదికి రూ. 12,000 సాయం ఇస్తామన్నారు. సంక్షేమ బోర్డు పెడుతామన్నరు. సింగిల్-పర్మిట్ పాలసీ, పెండింగ్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్, పెద్ద సిటీలల్ల ఆటోనగర్ల నిర్మాణం.. పట్టపగలే ఇలాంటి కలలెన్నో చూపించిండ్రు. ఒక్కసారి ఆలోచించండి.. ఓట్లప్పుడు ఇచ్చిన హామీలను ఈ సర్కార్ కచ్చితంగా నెరవేర్చి ఉంటే ఇప్పుడు సామాన్యుడి వీపు మీద ఈ రేంజిలో చార్జీల మోత మోగేది కాదుకదా! ఆటో డ్రైవరన్నలకు కూడా ఎంతో భరోసా ఉండేది. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కినా, ఆటో ఎక్కినా పేద, మధ్యతరగతి ప్రజల గుండెలు ఆటో మీటర్ కంటే వేగంగా కొట్టుకోవడం పక్కా!
కొత్త సర్కార్.. పాత ఐఆర్..!

ఉద్యోగులు పే స్లిప్‌లోని ఐదు శాతం ఐఆర్‌ను కేసీఆర్ ఆనవాలుగా చూసుకుంటున్నారు. 2023 అక్టోబర్ 2న అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో-133 ఇప్పుడు ఉద్యోగుల జీతాల్లో పాత జ్ఞాపకంలా మెరుస్తున్నది. పీఆర్సీ వచ్చేదాకా తాత్కాలిక ఉపశమనమని కేసీఆర్ ఇచ్చిన 5 శాతం ఐఆర్.. మూడేండ్లు దాటినా అదే శాశ్వత ఊరటగా మారింది. ఇక పీఆర్సీ సంగతి అడిగితే సర్కార్ పెద్దలు సాకులే ఎక్కువ చెప్తున్నరు. పీఆర్సీ పత్తా లేదు. కమిటీ గడువు పెరుగుతూనే ఉన్నది. రిపోర్టు ఎక్కడున్నదో, ఎప్పుడు వస్తదో కమిటీ వేసినోళ్లకు తప్ప తమకే కాదు, దాన్ని అడుగుతున్న లీడర్లకు కూడా తెలియదని ఉద్యోగులు జోకులేసుకుంటుండ్రు. చివరకు ఉద్యోగ సంఘాలే ‘పీఆర్సీ రిపోర్టు తెప్పించండి సారూ’ అంటూ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి ఏందంటే.. కొత్త సర్కారు దగ్గర పీఆర్సీ కోసం ఎదురుచూపులు, పాత సర్కార్ ఇచ్చిన ఐఆర్ మీదే ఈఎంఐలు. కాలం మారింది గానీ, పే స్లిప్‌లో మాత్రం పాత జ్ఞాపకమే ఇంకా తాజాగానే ఉన్నదన్నమాట! అందుకే ఉద్యోగులు అనుకుంటున్న గుసగుస.. ‘సర్కారు కొత్తదైనా.. ఐఆర్ పాతదే; పీఆర్సీ మాత్రం ఎప్పటికీ పత్తా లేనిదే!’