e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home News రెండో దశ చైతన్యానికి ఎదగాలి

రెండో దశ చైతన్యానికి ఎదగాలి

తెలంగాణ ప్రజలు తమ మొదటిస్థాయి చైతన్యం నుంచి ఇక రెండవస్థాయి చైతన్యానికి ఎదగవలసి ఉంది. తమకు ఇతరుల నుంచి జరిగిన అన్యాయాలపై పోరాడటంలో వారు మొదటిస్థాయి చైతన్యాన్ని పూర్తిగా ప్రదర్శించారు. విజయం సాధించి ఆ ఫలితాలను అనుభవిస్తున్నారు. అయితే ఆ ఫలితాలు తమకు వ్యక్తిగతంగానో, తమ వర్గాలకో పరిమితమై గాక, రాష్ట్రంలోని అందరు వ్యక్తులకు, అన్నివర్గాలకు లభించాలనుకోవటం రెండవస్థాయి చైతన్యమవుతుంది.

ఇంకా చెప్పాలంటే, తమ సమాజంలోని అందరు వ్యక్తులకు, అన్నివర్గాలకు ఫలితాలు లభించాలనే విశాలమైన దృష్టి లేకుండా తమకు, తమ వర్గాలకు మాత్రమేననే సంకుచిత దృష్టికి పరిమితమైన పక్షంలో మొదటిస్థాయి చైతన్యానికి అర్థమే ఉండదు. అటువంటి స్వార్థం వల్ల తాము బాగుపడుతారేమో తెలియదు గాని, తెలంగాణకు మేలు జరుగదు. ఇతరులు చేసిన అన్యాయాలపై పోరాడటమూ నిరర్థకమవుతుంది. ఈ ఉపోద్ఘాతాన్ని ఇంతటితో ఆపి ఒక ఉదాహరణతో సూటిగా విషయంలోకి వెళదాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘దళితబంధు’ పథకంపై ముమ్మరంగా మొదలైన చర్చ ఇప్పటికీ ముగియలేదు. ఇది దళితులకు మాత్రమే ఎందుకు? ఇతర సామాజిక వర్గాలకు ఎందుకివ్వరు? దళితుల వలెనే ఇతరులలో పేదలు లేరా? అన్నవి ప్రధానమైన ప్రశ్నలు.

- Advertisement -

వాస్తవానికి ఇందుకు తగిన వివరణను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ పథకాన్ని ప్రకటించినప్పుడే గాక ఆ తర్వాత కూడా మూడు నాలుగు సార్లు ఇచ్చారు. దాని సారాంశం ఈ విధంగా ఉంది: – ‘సమాజంలో ఆర్థికంగా పేదలు అన్ని వర్గాలలో ఉన్నారు. కానీ కులపరంగా అతి తీవ్రమైన సామాజిక వివక్ష దళితుల విషయంలో మాత్రమే ఉంది. అంటరానితనం, గ్రామాల నుంచి వెలి, దేవాలయాలలోకి ప్రవేశం లేకపోవటం, సామాజికంగా వారిపై ఇతరుల పూర్తి ఆధిపత్యం, ఇతరత్రా అన్ని విధాలుగా హీనంగా చూడటం వంటివి దళితుల విషయంలోనే ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా లేని ఇటువంటి భయంకర స్థితిని తోటి మానవుల పట్ల సృష్టించింది మనమే. ఇది వేల ఏండ్లుగా కొనసాగుతున్నది. దీనిని రూపుమాపవలసింది మనమే.

దళితుల పట్ల మనం చేస్తూ వస్తున్న ఈ నేరాన్ని తొలగించేందుకు మొదటి అడుగు వారిని పేదరికం నుంచి బయటపడవేయటంతో ఆరంభం కావాలి. దళితుల ఈ స్థితిని, ‘దళితబందు’ పథకంలోని ఈ ఉద్దేశాలను ఇతరులు అర్థం చేసుకోవాలి. ఈ పథకం విజయవంతమైతే ఈ వర్గాల ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడి ఆత్మవిశ్వాసంతో, గౌరవంగా జీవిస్తారు. వారి భవిష్యత్తు తరాలు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తాయి.’

దళితుల సామాజిక, ఆర్థిక, చారిత్రక స్థితిగతులను, భవిష్యత్తును, వారిపట్ల తక్కిన సమాజం చేసిన నేరాన్ని, భవిష్యత్తు కోసం తీసుకోవలసిన బాధ్యతను రంగరించి ముఖ్యమంత్రి ఎంతో సావధానంగా, సంయమనంగా, ఒక కుటుంబ పెద్ద వలె చెప్పిన మాటలివి. బలహీనుల బాగులోనే సమాజమంతటి బాగుతో పాటు భద్రత కూడా ఉంటుందన్నది ఆయన ఉద్దేశం. నిజానికి ఇది తెలంగాణకు మాత్రమే గాక ఏ సమాజానికైనా వర్తించే సార్వత్రిక సూత్రం. కొద్దిపాటి వివేచన గలవారెవరైనా నిష్పక్షపాతంగా, హేతుబద్ధంగా ఆలోచిస్తే ఇది అర్థం చేసుకోగలరు. తెలంగాణ ప్రజలు అన్యాయాలపై పోరాడిన మొదటిస్థాయి చైతన్యాన్ని పూర్తిగా ప్రదర్శించిన వారైనందున ఇంకా బాగా అర్థం చేసుకోగల విషయమిది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మొదటిస్థాయి నుంచి ఈ రెండవ స్థాయికి ఎదగటం వారికి ఎంతమాత్రం కష్టం కానక్కరలేని విషయం. పైగా, ఆర్థిక పరిస్థితి వెసులుబాటును బట్టి ఇదే విధమైన పథకాన్ని అన్ని సామాజిక వర్గాలలోని పేదలకు క్రమంగా వర్తింపజేస్తూ పోగలమని కేసీఆర్‌ ఒకటికి నాలుగు మార్లు హామీ ఇచ్చారు. పైగా, ఇతరత్రా చూసినప్పుడు, వివిధ పథకాలు, అభివృద్ధితో లాభపడుతున్న వారిలో దళితులకన్న ఇతర సామాజిక వర్గాలవారే ఎక్కువ.

పైన చెప్పుకొన్న వివిధ విషయాలన్నింటిని గమనికలోకి తీసుకున్నప్పుడు, ఇటువంటి పథకం దళితుల కోసం ఎందుకు? మొదట వారికోసం ఎందుకు? అనే ప్రశ్నలు ఉత్పన్నమే కావు. అంతా తేటతెల్లంగా ఉన్నదే. అయినప్పటికీ రాజకీయవాదులు కొందరు తమ ప్రయోజనాల కోసం, విషయాలను అర్థం చేసుకోనివారు తమ అవగాహన లోపంతో, దురుద్దేశపరులు తమ స్వభావాన్ని మార్చుకోలేక, దళితులను పీడించేందుకు అలవాటుపడిన మనుషులూ, వర్గాలు ఆ కారణంగా ఈ పథకంపై విమర్శలు చేయవచ్చు గాక. తమ మొదటిస్థాయి చైతన్యాన్ని నిరర్థకం చేసుకుంటూ విస్తృత తెలంగాణ సమాజానికి హాని చేస్తే చేయవచ్చుగాక. కానీ తక్కిన సమాజం రెండవస్థాయి చైతన్యానికి ఎదగాలి. ఇందుకోసం ప్రభుత్వం తను చేయవలసింది, చెప్పవలసింది చెప్తుంది. కానీ అందుకు ఇంకా ఎక్కువ బాధ్యతను మేధావులు, రచయితలు, కళాకారులు తీసుకోవాలి.

టంకశాల అశోక్‌
98481 91767

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement