హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) దవాఖానకు రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టింది. అదే సంస్థకు ఇన్చార్జి డైరెక్టర్‌గా ప్రస్తుత మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ) నరేంద్రకుమార్‌ను నియమించింది.
ప్రస్తుతం డీఎంఈగా ఉన్న నరేంద్రకుమార్ శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఆయన పరిపాలనా అనుభవాన్ని సనత్‌నగర్ టిమ్స్‌కు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనను ఇన్చార్జి డైరెక్టర్‌గా నియమిస్తూ జీవో నంబర్ 64 జారీ చేసింది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న అడిషనల్ డీఎంఈ వాణిని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జీవో 318 జారీ చేసింది.