హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులు పండించిన పంటను కొని ఆదుకోవాలని అడిగితే.. బాధ్యత గల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు ఎదురుదాడి చేయడం దుర్మార్గమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి వేయాలంటూ రైతులను ఉసిగొల్పుతుంటే.. కిషన్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కిషన్‌రెడ్డి ఆత్మద్రోహానికి, తెలంగాణ ద్రోహానికి పాల్పడుతున్నారని విమర్శించారు.
యాసంగి వడ్ల సేకరణ విషయంలోనే కాకుండా.. మొత్తంగా వ్యవసాయం పైనే కేంద్రానికి స్పష్టత లేదని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లపై ఆరేడు నెలలుగా కేంద్రాన్ని కోరుతుంటే ఉలుకూపలుకూ లేదని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌పైనా, రాష్ట్ర ప్రభుత్వం పైనా సంస్కార హీనంగా మాట్లాడినా రాష్ట్ర, రైతాంగం ప్రయోజనాల కోసం భరించామన్నారు. తమ దగ్గర నాలుగేండ్లకు సరిపడా బియ్యం నిల్వలున్నాయని, రైతులు ఇతర పంటలు వేసుకోవాలంటూ కేంద్రమంత్రి గడ్కరీ మాట్లాడిన వీడియో క్లిప్‌ను మంత్రి విలేకరులకు చూపించారు.
కేంద్రానికి వడ్లు కొనటం చేతకాకపోతే బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర నిర్ణయించే అధికారంకానీ, ధాన్యం నిల్వ ఉంచుకునే అధికారం కానీ రాష్ర్టాలకు లేదనే విషయాన్ని విస్మరించి కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు.
రైతుల పక్షాన తాము నిలబడితే బెదిరింపులకు గురిచేయటమే కేంద్ర ప్రభుత్వ విధానంగా మారిందని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. నరేంద్రమోదీ ప్రధానిలా కాకుండా చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన ట్వీట్‌ను ఆయన చూపించారు. రాష్ట్ర రైతాంగానికి నష్టం వాటిల్లుతుంటే తెలంగాణ బిడ్డగా స్పందించాల్సిన కిషన్‌రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కేంద్రం రైతులు పండించిన పంట కొనేదాకా వెంబడి పడతామని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి తాను సెప్టెంబర్ 1న కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ ఇంటికి వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రాధేయపడ్డామని చెప్పారు. తమ రైతులను ఆదుకోవాలని, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమని అనేక విధాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తే కేంద్రమంత్రులు, అధికారులు అపహాస్యం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఈ విషయాన్ని కిషన్‌రెడ్డికి చెప్తే పట్టించుకోలేదని మండిపడ్డారు. కిషన్‌రెడ్డికి రైతులు ఏమైపోయినా ఫర్వాలేదు కానీ సంజయ్‌ను అంటే మాత్రం ఊరుకోలేకపోతున్నారని ఎద్దేవాచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్, పార్టీ నేత ఒద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.