హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న వెటరన్ స్విమ్మర్ గోలి శ్యామలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. ఇటీవల అమెరికాలోని కేటలీనా జలసంధి(36కి.మీ)ని విజయవంతంగా ఈదిన శ్యామలను గురువారం మంత్రి సన్మానించారు. భవిష్యత్‌లో సప్త సముద్రాలు ఈది దేశ రాష్ట్ర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని ఆయన అకాంక్షించారు. పసిఫిక్ మహా సముద్రంలోని 46కి.మీల పొడవైన మొలోకయి కైవీ జలసంధిని త్వరలో తాను ఈదబోతున్నట్లు శ్యామల ఈ సందర్భంగా మంత్రికి వివరించింది. గతంలోనూ భారత్, శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిని విజయవంతంగా ఈదిన రెండో మహిళగా శ్యామల రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.