హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటయ్యారు. వారు చేస్తున్న కుట్రలకు ఇక్కడి పాలకులు పరోక్షంగా సహకరిస్తున్నా రు. అందుకే తెలంగాణ అస్తిత్వ చిహ్నా లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి’ అని తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) అధ్యక్షుడు ఎర్రోజు శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన టాస్క్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆనవాళ్లు చెరిపివేసే ప్రయత్నాల్లో భాగంగానే తెలంగాణలో టీడీపీని పునరుద్ధరించాలనే ప్రభుత్వ పెద్దల మాటలను మనం వింటున్నామని, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నది పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పాటై పన్నెండేండ్లు గడిచినా టీడీపీ కుట్రలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజును చీకటి దినంగా వర్ణించిన టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలు మాటల వెనకాల ఆంధ్రా సీఎం కుతంత్రం దాగి ఉన్నదని ధ్వజమెత్తారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల విషయంలో కేంద్రం వైఖరిని విపక్షాలు తప్పు పడుతున్నాయని, దానిని డైవర్షన్ చేసేందుకే తెలంగాణ అంశాన్ని వాడుతున్నారా? అని ప్రొఫెసర్ సీతారామారావు ప్రశ్నించారు. టాస్క్ నాయకులు వేణుగోపాలస్వామి, జీ వెంకటేశ్వర్లు, కో కన్వీనర్లు హెచ్ రవీందర్, ముల్కా సురేశ్, సభ్యులు పాల్గొన్నారు.
ఖమ్మం సిటీ, మార్చి 11: ఏపీకి చెం దిన టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని బీఆర్ఎస్ ఖ మ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మండిపడ్డారు. బుధవారం ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్డుపై బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ఎదురుగా నగర పార్టీ ఆధ్వర్యంలో కృష్ణదేవరాయలు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. కృష్ణదేవరాయలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు
తెలంగాణ బిల్లు అమోదం పొందిన చారిత్రాత్మక రోజును పార్లమెంట్ సాక్షిగా బ్లాక్ డేగా పేర్కొంటూ టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం వారి ఫొటోల ఫ్లెక్సీని బీఆర్ఎస్వీ నాయకులు దహనం చేశారు.