అచ్చంపేట : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు (Guvvala Balraju) అన్నారు. అచ్చంపేటలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ (Telangana Formation) దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పూలమాలవేసి జెండాను ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను స్తంభింప చేసి 36 రాజకీయ పార్టీలతో తెలంగాణకు జై కొట్టించారని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గా కేసీఆర్ 10 సంవత్సరాల కాలం ప్రగతిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అమినువుద్దీన్, శంకర్ మాదిగ, రాంబాబు, అంతటి శివ, కుబుద్దీన్, ఆంజనేయులు, కార్తీక్, శివ, రాంబాబు, నరసింహ, రహమత్, వంశీ, శివ తదితరులు పాల్గొన్నారు.