హైదరాబాద్ సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఢిల్లీలో సోమవారం కొలీజియం సమావేశంలో జస్టిస్ అపరేశ్కుమార్సింగ్తోపాటు గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ పేర్లను కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. జస్టిస్ అపరేష్‌కుమార్‌సింగ్ 1965 జూలై 7న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్, ఎల్ఎల్బీ పూర్తిచేశారు. 1990 నుంచి 2000 వరకు పాట్నా హైకోర్టులో, 2001 నుంచి జార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు.
2012 జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2014 జనవరి 16న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జార్ఖండ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2022 డిసెంబరు 20 నుంచి 2023 ఫిబ్రవరి 19 వరకు జార్ఖండ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించారు. 2023 ఏప్రిల్ 17న త్రిపుర హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేశారు. 2025 జూలై 19న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. కొలీజియం సిఫార్సులను కేంద్రం రాష్ట్రపతికి నివేదిస్తుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తదుపరి వీరు ప్రమాణ స్వీకారం చేస్తారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్‌ను నీట్ మారుల ఆధారంగా రద్దు చేసినప్పుడు విద్యార్థి చెల్లించిన ఫీజును తిరిగి ఇవ్వాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. గురునానక్ హోమియోపతి మెడికల్ కాలేజీలో నిరుడు అక్టోబర్ 27న తనకు ఇచ్చిన అడ్మిషన్‌ను జనవరి 3న రద్దు చేస్తూ కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం జారీచేసిన ఉత్తర్వులను సవా లు చేస్తూ ఆదిలాబాద్‌కు చెందిన శబరిప్రియ వేసిన పిటీషన్‌ను జస్టిస్ జువ్వా డి శ్రీదేవి విచారించారు. అడ్మిషన్ రద్దు చేసినందున పిటిషనర్ చెల్లించిన 3.32 లక్షల ఫీజును ఆరు వారా ల్లో తిరిగి చెల్లించాలని కాలేజీని ఆదేశించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో దర్యాప్తు పూర్తయి చార్జిషీట్ దాఖలైందన్న కారణంతో నిందితుడికి బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో బాధితురాలిపై నిందితుడు ప్రభావం చూపే అవకాశం ఉందా అనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేరొంది. నిందితుడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టంచేసింది. పోక్సో కేసులో గత జూన్ 9న అరెస్టయిన ఎండీ గౌస్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ మధుసూదనరావు ఇటీవల కొట్టివేశారు.