హైదరాబాద్, ఏప్రిల్26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని టైలరింగ్ ఆధారిత స్వయంఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు బీసీ మహిళలకు ఆటోమెటిక్ కుట్టుమిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాల మాయాదేవి ఉత్తర్వులు జారీచేశారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 1,000 మంది బీసీ మహిళలకు సబ్సిడీ కింద ఆటోమెటిక్ కుట్టుమిషన్లను బీసీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేయనున్నారు.
ఈ పథకం మార్గదర్శకాలు, ఎస్టిమేషన్లు సమర్పించాలని బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్యభట్టును ప్రభుత్వం ఆదేశించింది. కుట్టుమిషన్ల పంపిణీ ద్వారా నైపుణ్యం ఉన్న బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయంఉపాధి కల్పించి, ఉత్పాదకతను పెంచి, వ్యాపార అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొన్నది.