హైదరాబాద్: సంక్లిష్టమైన సామాజిక సమస్యలకు పరిష్కారాల కోసం స్టార్టప్ కంపెనీలు, ఎన్జీవోలు కలిసి పనిచేసేందుకు సహకారం అందించే వేదికను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇంపాక్ట్ ల్యాబ్స్ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్ (టీసీఐసీ) శ్రీకారం చుట్టింది. విద్య, ఆరోగ్యం, న్యూట్రీషన్, సహకార సాంకేతికత, వృద్ధాప్య సాధికారత, మహిళలు-శిశువుల అభివృద్ధి, ఆకలి, వ్యవసాయం, జీవన పరిస్థితులు, సామాజిక అభివృద్ధి, వాతావరణ మార్పులు వంటి సామాజిక సమస్యలకు పరిష్కారం కోసం స్టార్టప్ కంపెనీలు ఎన్జీవోలతో కలిసి పనిచేసేందుకు ఈ ఇంపాక్ట్ ల్యాబ్స్ ఉపయోగపడతాయి.
ఈ కార్యక్రమంలో యాక్షన్ ఎయిడ్ ఇండియా, వరల్డ్ విజన్ ఇండియా, సేవ్ ది చిల్డ్రన్, గ్రీన్‌పీస్, సోపార్-బాలవికాస, అక్షయ పాత్ర, యంగిస్థాన్ ఫౌండేషన్, ప్లాన్ ఇంటర్నేషనల్, హెల్ప్‌ఏజ్ ఇండియా వంటి ఎన్జీవోలు భాగస్వాములుగా ఉన్నాయి.
ఈ కార్యక్రమం గురించి తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ సి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ‘స్టార్టప్‌లు సమాజంపై చూపే ప్రభావాన్ని వివిధ సంస్థల సహకారానికి ఆపాదించాలి. ఈ అంశంపై ఫోకస్ ఇప్పటికే పెరుగుతున్న ఫోకస్‌ను కూడా ఈ విషయంపై కేంద్రీకరించాలి. ఈ ఆలోచనను మరో స్థాయికి తీసుకెళ్లడంలో తెలంగాణ ప్రభుత్వం చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఇంపాక్ట్ ల్యాబ్స్‌ను ప్రారంభించింది. దీనిలో భాగంగా స్టార్టప్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల మధ్య కీలకమైన భాగస్వామ్యానికి ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది’ అని వెల్లడించారు.