బిడ్డను గాయనిగా చూడాలని తండ్రి కల. చాలా రోజులకు ఒక మంచి అవకాశం వచ్చింది. తెల్లారితే ప్రోగ్రామ్. ఇంతలోనే నాన్న మరణం. కల నిజం కాకుండానే ఆ తండ్రి తనువు చాలించాడు. పెద్దదిక్కు లేకపోవడంతో చాలా కష్టాలు పడింది ఆ యువతి. తనను తాను నిరూపించుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. పాటల చుక్క.. చుక్కా నాగమణి జానపదాల ముచ్చట!
మాది మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంచర్లగూడెం. మూడో తరగతి నుంచే పాటలు పాడేదాన్ని. మేం నలుగురం అక్కాచెల్లెండ్లం. ఒక అన్న. అక్కవాళ్లు స్కూల్లో, కాలేజీలో పాడుతుంటే విని నేనూ జానపదాలు నేర్చుకున్నా. నాన్న ఎల్లయ్య, అమ్మ సుధేష్ణ. నాన్న మా అందర్నీ పీజీ వరకు చదివించిండు. ఐదో తరగతిలో ఉన్నప్పుడు నాకు మండల స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ‘ఒకే పువ్వు పలు దళాల పరిమళం ఒక్కటే’ పాట పాడిన. ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నా. అందరూ నాకు సంగీతం వస్తదని అనుకున్నరు. అమ్మానాన్న కూడా ఆశ్చర్యపోయిండ్రు. మా అక్కవాళ్లు నాకు ఈ పాట నేర్పించిండ్రు. మా నాన్నకు జిల్లాలో మంచి పేరున్నది. అప్పట్లో ఒక రాజకీయ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా చేసిండు. ‘ఫలానా పాట పాడిన అమ్మాయి ఎల్లన్న బిడ్డెనంట’ అని వాళ్లూ వీళ్లూ అంటుంటె మస్తు ఖుషీ అయ్యిండు. మా హెడ్మాస్టర్ పాండు రంగారెడ్డి సార్‌కు నా పాటంటే చానా ఇష్టం. సార్ రిటైర్ అయ్యే సమయానికి నేను హాస్టల్లో చదువుతున్నా. నేను ఎక్కడున్నానో తెలుసుకొని మరీ పిలిపించి వీడ్కోలు కార్యక్రమంలో నాతో పాట పాడించిండ్రు. ఆయనతో పాటు నాకూ సన్మానం చేసి పంపిండ్రు. డిగ్రీ, పీజీ సింగరేణి ఉమెన్స్ కాలేజీలో చేసిన. అక్కడ ప్రతీ శనివారం కల్చరల్ డే. కాలేజీ అయిపోయినంక కూడా ఆడిటోరియంలో ప్రాక్టిస్ చేసేదాన్ని.
నాన్నతో చివరిమాట
మా పెద్దబావ కళాకారుడు. ఆయనే నన్ను తెలంగాణ ఉద్యమంలోకి తీసుకెళ్లిండు. అవకాశం ఉన్నప్పుడల్లా నాతో పాడిస్తుండె. డిగ్రీ ఫైనలియర్‌కి వచ్చేసరికి పాటపై పూర్తి పట్టు సంపాదించిన. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నా. ఓ పెద్ద ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో గద్దరన్న ప్రోగ్రామ్‌లో పాడే అవకాశం వచ్చింది. గద్దర్ ప్రోగ్రామ్ అంటే కళాకారులకు అచీవ్మెంట్ లెక్క ఉంటుండె. అంతా సిద్ధమైంది. నేను హాస్టల్లో ఉండేదాన్ని. తెల్లవారితే ప్రోగ్రామ్. నాన్న ఫోన్ చేసి ‘అమ్మా.. తొందరగా రెడీ అయ్యి ఉండు. నేను పికప్ చేసుకోవడానికి వస్తా. గుడ్‌నైట్’ అని చెప్పి పెట్టేసిండు. నాతో అదే చివరి మాట. మొబైల్ చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ అయ్యింది. నాన్న చనిపోయిండు. ‘నాన్నా! నేను సింగర్ కావాలనుకుంటున్నా’ అంటే ‘నీకేదనిపిస్తే అది చెయ్యి బిడ్డా’ అని ఎంకరేజ్ చేస్తుండె. ఆడపిల్లలు చదువుతో పాటు ఆటపాటల్లో యాక్టివ్‌గా ఉండాలనేది నాన్న అభిప్రాయం.
లక్ష్యం గుర్తొచ్చేది
నాన్న మరణంతో నా పాటకు బ్రేక్ పడింది. చాలా సమస్యలు వచ్చినయి. హాస్టల్లో మెస్ ఫీజు కట్టలేదన్న కారణంతో హాలిడేస్‌కు వెళ్లలేకపోయిన. మా పెద్దక్కకు విషయం తెలిసి పైసలు పంపింది. బాధ పడుతూ కూర్చుంటే ఏ సమస్యా పరిష్కారం కాదని అర్థమైంది. కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకున్నా. డిగ్రీ తర్వాత మూడేండ్లు టీచర్‌గా పనిచేసిన. విద్యార్థులకు వాళ్ల లక్ష్యాల గురించి చెబుతున్నప్పుడు, నా లక్ష్యం సంగతేందన్న ఆత్మవిమర్శ మొదలైంది. అన్న, అమ్మ, అక్కలతో మాట్లాడిన. ‘నేను సింగర్‌గా రాణించాలె అని నాన్నకు కూడా ఉండేది. ఒక్కసారి అవకాశం ఇస్తే నా టాలెంట్ నిరూపించుకుంటా’ అని అడిగిన. నన్ను నిరుత్సాహ పరచాలన్నది మావాళ్ల ఉద్దేశం కాదు కానీ, ‘పెద్దదిక్కు లేని ఆడపిల్ల’ అనే జంకు. సమాజం ఏం అనుకుంటుందో అన్న ఆలోచన. అదే సమయంలో మా చుట్టాలమ్మాయి సింగర్‌గా రాణిస్తున్న క్రమంలోనే హత్యకు గురైంది. మా వాళ్ల భయానికి ఇదీ ఒక కారణమే.
కెరీర్ మారిపోయింది
అన్న నా కష్టాన్ని కండ్లారా చూసిండు. తెలిసిన వాళ్లకు నా గురించి చెప్పిండు. ‘ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతున్నరు. మన దగ్గరే లలిత స్టూడియో ఉన్నది’ అని ఎవరో చెప్పడంతో వెళ్లి ప్రయత్నించినం. ‘నిన్నుజూడ వస్తినే ముద్దులా లావణ్య’ అనే పాటకు అవకాశం దొరికింది అక్కడే. ఒకసారి యూట్యూబ్ సెర్చ్ చేస్తుండగా మానుకోట ప్రసాదన్న పాట కనిపించింది. ‘ప్రసాద్ మా క్లాస్మేటే. ఒకసారి కాల్చేసి అడుగుతా ఆగు’ అని మా రెండో అక్క నా గురించి చెప్పింది. ప్రసాదన్న మూడు నెలల తర్వాత ‘రాయిని పూజించే మనసే మనకుంది. అమ్మను ప్రేమించే గుణమే లేకుంది’ పాటకు అవకాశం ఇచ్చిండు. అయితే నా వాయిస్ సెట్ అవ్వడం లేదని ఆ పాట ఆపేసి, ‘నాకో నల్లచీరున్నాది.. అంచున మల్లె మొగ్గున్నాది.. కొంగున కోడిపుంజున్నాది’ పాట పాడించిండు. ఈ పాటతో నా కెరీర్ మారిపోయింది. ఆ రెస్పాన్స్ చూసి పక్కన పెట్టిన అమ్మ పాట కూడా పాడించిండు ప్రసాదన్న. ఈ రెండు పాటలూ నన్ను ఎక్కడికో తీసుకెళ్లినయి. అలా మొత్తం 70 పాటల దాకా పాడిన. పెండ్లయినంక మా ఆయన చాలా ప్రోత్సహిస్తుండు.
తొలి పారితోషికం
నేను టీచర్‌గా పనిచేసిన స్కూల్ ప్రిన్సిపల్ సాదిఖ్ సార్‌కు నా పాటల గురించి తెలిసింది. కల్చరల్ టీచర్‌గా అవకాశం కల్పిస్తే పిల్లలకు పాటలు నేర్పించడం మొదలు పెట్టిన. నాకూ ప్రాక్టిస్ అయ్యేది. సాదిఖ్సారే ఒకసారి ‘యూట్యూబ్ జానపదాలకు వేదికగా మారుతున్నది. రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ఉండొచ్చు. మీతోపాటు, విద్యార్థులకూ అవకాశాలు ఉంటయి. ఒకసారి ఆలోచించు’ అని చెప్పిండ్రు. నిజమే అనిపించింది. సార్వాళ్ల ఫ్రెండ్ సహకారంతో వరంగల్‌లోని ఒక స్టూడియోకు వెళ్లిన. మధ్యాహ్నం వెళ్తే రాత్రి రెండు అయ్యింది. వాయిస్ నచ్చి ఒక పాట పాడే అవకాశం ఇచ్చిండ్రు. పారితోషికం ఐదొందలు. నాకు పైసలకన్నా వేదిక ముఖ్యం. అందుకే మనసుపెట్టి పాడిన.