డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ అయిన క్యూబ్, యుఎఫ్ఓ, పీఎక్స్డీలు వసూలు చేస్తున్న అధిక యూజర్ ఛార్జీలకు వ్యతిరేకంగా బుధవారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎఫ్‌సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో ముగ్గురు నిర్మాతలు స్వార్థంతో చేస్తున్న నిర్వాకాల వల్ల చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ తెలుగు నిర్మాతల నుంచి వారానికి పదివేల రూపాయలను వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కో సినిమా రిలీజ్‌కు పదిలక్షల రూపాయలు నిర్మాతలకు భారమవుతున్నది.
పక్కరాష్ర్టాల్లో 3వేల వరకు మాత్రమే ఛార్జీలు వున్నాయి. ముగ్గురు నిర్మాతలు ఈ డిజిటల్ ప్రొవైడింగ్ కంపెనీల్లో పార్ట్‌నర్స్‌గా ఉంటూ ఇండస్ట్రీని లూటీ చేస్తున్నారు. థియేటర్లలో తినుబండారాలకు వందల రూపాయల ఖర్చవుతుంది. టికెట్ రేట్లు భారీగా ఉన్నాయి. దీంతో సామాన్య ప్రేక్షకుడు థియేటర్లలో సినిమాకు దూరమవుతున్నాడు. డిజిటల్ ప్రొవైడర్ల అధిక ఛార్జీల వసూలుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆ నిర్మాతల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ సాయివెంకట్, ఏ.గురురాజ్, దర్శకుడు సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.