‘నేను ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో ఇదొక విభిన్నమైన సినిమా. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో ప్రయాణం చేసిన అనుభూతి కలిగింది. ఈ జోనర్లో నాకు మరిన్ని సినిమా ఆఫర్లను అందిస్తుందనే నమ్మకం ఏర్పడింది’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. ప్రస్తుతం ఆయన స్వరకర్తగా వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన సంగీతాన్నందించిన తాజా చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి నాని కాసరగడ్డ దర్శకుడు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ విలేకరులతో మాట్లాడారు. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తదని, ఈ మధ్యే డీటీఎస్లో సినిమా చూసినప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించిందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ఇందులో రెండు మెలోడీ పాటలున్నాయి. ఇవి కథానుగుణంగానే వస్తాయి.
నేను మ్యూజిక్ అందించిన బలగం, మాస్ జాతర, ధమాకా, మ్యాడ్, టిల్లు స్కేర్, సంక్రాంతికి వస్తున్నాం..చిత్రాలన్నీ డిఫరెంట్ జోనర్స్లో రూపొందాయి. గతకొంతకాలంగా ఇంతటి వేరియేషన్స్ ఉన్న సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నా. దర్శకనిర్మాతలు నాపై నమ్మకం ఉంచడం వల్లే ఇది సాధ్యమైంది’ అన్నారు. తాను చేసే మాస్ ఓరియెంటెడ్ సౌండింగ్ ఈ సినిమాలో కనిపించదని, పూర్తిగా కొత్తరకం సౌండింగ్ వింటారని, కథకు అవసరమైన వాయిద్యాలను ఉపయోగించానని భీమ్స్ తెలిపారు. ‘ దర్శకుడి అభిరుచి మేరకు కథకు తగిన మ్యూజిక్ ఇవ్వాల్సిన బాధ్యత స్వరకర్తపై ఉంటుంది. నా వరకు నేను జనంతో అనుబంధం ఉండే పాటలే అందిస్తాను. నేను కాంపిటీషన్ గురించి అస్సలు పట్టించుకోను. దర్శకనిర్మాతలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇక విమర్శల గురించి కూడా అంతగా ఆలోచించను. విమర్శించే వాళ్లు కూడా నా శ్రేయోభిలాషులే అనే భావనతో ముందుకెళ్తా. అన్ని విషయాలను పర్సనల్‌గా తీసుకుంటే మనశ్శాంతితో ఉండలేం’ అని భీమ్స్ సిసిరోలియో తెలిపారు.